Menu
2018 Movie Telugu Review

2018 Movie Telugu Review: ‘2018’ సినిమాలో అంతగా ఏముంది?

2018 Movie Telugu Review:  2018 సినిమా (2018 Movie Telugu Review) సూటిగా ఏ మెసెజ్ ఇవ్వలేదు. ఓ కల్లోలాన్ని కళ్ల ముందు ఉంచిది.  ప్రమాదపు అంచుల్లో ఉన్నప్పుడు మనుషుల ఆందోళనను, ఒకరికొకరు చేసుకునే చిన్న చిన్న సాయాలు ఎంత ఉపశమనాన్ని ఇస్తాయో చూపించింది.

నిజానికి ఓ విలయాన్ని, ఓ విపత్తుని సినిమాగా తీయాలనుకోవడమే ఓ పెద్ద సాహసం. ఎదుటవాళ్లని కనీసం పట్టించుకోని ఈ కాలంలో ఒకరి దు:ఖాన్ని దర్శించడం, దానిని తెరపై ఆవిష్కరించడం అంత సులభమైన విషయం కాదు. ఈ విషయంలో దర్శకుడు జూడో ఆంటోని జోసెఫ్ పూర్తిగా సఫలం అయ్యాడు.

“మనల్ని మనం కాపాడుకోవాలి.. మన తోటి వాళ్లని కాపాడాలి. కష్టకాలంలో మన స్నేహితులకి, పరిచయస్తులకి, పలకరించేవాళ్లకి అండగా ఉండాలి. ఎవరిదైనా ప్రాణమే.. ఎవరికైనా కష్టం కష్టమే.. ఈ సాధారణ స్పృహ కరువైనా ఈ కాలంలో ఈ సినిమా ఓ అవసరం.”

2018 Movie ఇది కథా…

2018లో కేరళలో వచ్చిన వరదల సమయంలో ఒక గ్రామంలో ప్రజలు ఒకరికొకరు ఎలా సాయంగా నిలబడ్డారనేదే కథ. ఈ స్టోరీ కేరళలోని అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. సహజంగా ప్రజల మధ్య ఉండే అన్ని రకాల వైరుధ్యాలు, అభిప్రాయ బేధాలు, కుటుంబ కలహాలు, చిన్నా పెద్ద అనే తారతమ్యాలు అన్ని ఉంటాయి. ఒక్కొక్కరిది ఒక్కో కథ, ఒక్కో వ్యథ. ఇలా సాగిపోతున్న వారి జీవితాలని వరదలు తలకిందులు చేస్తాయి. ఈ సినిమాలో టొవినో థామస్ (Tovino Thamos), ఆసిఫ్ అలీ (Asif ali), లాల్ (Lal), ఇంద్రన్స్, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాల మురళి వంటి మలయాళం అగ్ర నటులు  జీవించారు. ఆ నటులు కనిపించరు.. క్యారెక్టర్లే మాత్రమే కనిపిస్తాయి.

2018 Movie పెనుగులాట… 

విపత్తు ముంచుకొచ్చినప్పుడు, చావు చివరంచున ఉన్నప్పుడు ఆ పెనుగులాట ఎలా ఉంటుందో.. బతకాలనే ఆశ, తన వాళ్లను బతికించుకోవాలనే తపన, ఆ నిస్సహాయత మాటల్లో చెప్పలేం. వరదల్లో మునిగిపోయిన గ్రామాల్లో ప్రజల మనుగడ, మానవత్వం, ఐక్యత, ఆశ, ధైర్యం, నిస్సహాయతలు ఎలా ఉంటాయో డైరక్టర్ అద్బుతంగా తెరకెక్కించాడు. కొన్ని నిజ జీవితాల్లోని సంఘటనలు ఆధారంగా ఈ సినిమాని తీశాడు. అది ఒక సినిమా (2018 Movie Telugu Review) అనే విషయం మరిచిపోయి మన కళ్ల ముందే జరిగినంత ఫీల్ కలుగుతుంది. అందులో ఉన్న పాత్రలతో మనం మమేకం అయిపోతాం. ఎందుకంటే ఆ పాత్రలు నాలుగు ఫైట్లు చేసి, ఆరు పాటలు పాడుకునేవి కావు.  మనలాగే సాధారణంగా ప్రవర్తించే మనుషులు.

ఇది కూడా చదవండి: పొట్టి కథలు-లోతైన జీవితాలు

ఈ మూవీలో (2018 Movie Telugu Review) చావుకు భయపడి ఆర్మీ నుంచి పారిపోయిన వచ్చిన ఓ వ్యక్తి.. చివరికి చావుకు ఎదురెళ్లి ఇతరుల ప్రాణాలను రక్షిస్తాడు. వరదల్లో కొట్టుకుపోతున్నవారిని మామూలు మత్స్యకారులు తమ బోట్లను వేసుకుని వెళ్లి కాపాడతారు. నీడ, తిండి కోల్పోయిన క్యాంపుల్లో తలదాచుకున్న వారికి కొంతమంది అన్నం పెట్టి ఆదరిస్తారు. మరికొంతమంది దుప్పట్లు, దుస్తులు అందిస్తారు. ఇలా సాధారణ మనుషులే ఒకరికొకరు సాయం చేసుకుని.. విపత్తును ఎదుర్కొంటారు. ఈ కల్లోలంలో చాలా ఇళ్లు కూలిపోతాయి. కొందరు ప్రాణాలు కోల్పోతారు. ఒకరి ప్రాణాలు కాపాడే క్రమంలో తమ ప్రాణాలు కోల్పోయిన పాత్రలు మన మనస్సులను కదిలిస్తాయి. కన్నీరు పెట్టిస్తాయి.

ఈ సినిమాలో మరో అద్భుతమైన విషయం ఏమిటంటే ఎవరూ త్యాగాలు చేయలేదు. జస్ట్ ప్రవర్తించారు. సరిగ్గా రియాక్ట్ అయ్యారు. తమలోని సహజమైన గుణాలతో తమ తోటి వాళ్ల కోసం పాటుపడ్డారు. దీనికోసం డైరక్టర్‌ జుడోకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇలా చూపించడానికి ధైర్యం ఉండాలి, ఎంతో మెట్యూరిటీ కూడా ఉండాలి. ఎందుకంటే మన సినిమాల్లో త్యాగాలు చేసే హీరోలను, హీరోయిన్లు చూసి అదొక అద్భుతమైన గుణం అని, అద్భుతమైన విలువ అనే మాయాజాలంలో పడిపోయిన వాళ్లు ఉన్నారు. అందుకే ఈ సినిమా డైరక్ట్‌ర్‌కి ఫిదా అవ్వాల్సిందే.

నిజానికి మన దేశంలో నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రిల్లోనే సరైన సదుపాయాలు లేవు. ఇలాంటి స్థితిలో విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలకు ప్రభుత్వాలు ఎంత వరకు భరోసా ఇస్తాయో? మనకు తెలియనదేం కాదు. ఇదే విషయాన్ని సినిమాలో (2018 Movie Telugu Review) సూటిగానే చూపించారు. అదేవిధంగా ఇంత ప్రళయంలోనూ అధికారులు చేసే నిర్లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయో ఒక సీన్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు.

కానీ ఒక కల్లోల స్థితిలో మనుషుల మధ్య ఉండే ఐక్యత వల్ల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. మానవత్వం ఉంటే తోటి వారి కష్టాలను తొలగించవచ్చు. విపత్తుల సమయంలో మారుమూల గ్రామాల్లో ఫోన్లు, కంప్యూటర్లు పని చేయకపోవచ్చు. అలాంటప్పుడు మన పక్కనున్న వ్యక్తే మనకు అక్కరకొస్తాడు. మనిషికి మనిషే తోడు. ప్రమాదకర పరిస్థితిలో ప్రేమ, మానవత్వం మాత్రమే మనుషులని కాపాడగలుగుతాయి. ఈ సినిమా అదే చూపించింది. అన్‌కండిషనల్‌గా ప్రేమించడం, సాయం చేయాలనే ఆలోచన, మానవత్వం, కొంచెం దయ, కరుణతో ఉండడం ఇవన్నీ మనిషికి సహజంగా ఉండాల్సినవి. కానీ అవన్ని ఎప్పుడో మనలో ధ్వంసమైపోయాయి. ఈ కనీస ‘విలువలు’ మనలో లేవు.

ప్రయోజనం లేకుండా ఏ మనిషితో మాట్లాడం. అబద్ధపు ప్రేమలు, ఫేక్ నవ్వులు.. ఎవరితో ఎంత నవ్వాలో.. ఎంత మాట్లాడాలో ముందే ఫ్రేమ్ బిగించుకుని ప్రతిరోజు అందులో ఒదిగిపోయే మర్యాదస్తులుగా మారిపోయి చాలా కాలమే అయిపోయింది. కానీ ప్రళయం వచ్చినప్పుడే మాత్రమే మన బతుకుల్లో ఎంత క్వాలిటీ ఉందో తెలుస్తుంది. ఏ వైరస్ ఎటు నుంచి దాడి చేస్తుందో తెలియని ఈ తరుణంలో మానవ సంబంధాలు చాలా అవసరం.

ఈ రోజుల్లో నిజమైన ప్రేమకు, నిజమైన స్నేహాలకు దూరమైపోతున్నామంటే మనం చావుకు దగ్గరవుతున్నామని అర్థం. అందుకే వైరస్‌ల నుంచే కాదు.. ఈ “లౌక్యం” బతుకుల నుంచి మన భావితరాలను కాపాడుకోవాలి. వారిలో ప్రేమ, స్నేహం, మానవత్వం, ధైర్యం, కరుణ, దయ వంటివి పెరిగే విధమైన విద్యనందించాలి. ఈ విలువలు మనలో ఉంటే ఏ విపత్తులు, ఏ వైరస్‌లు మనల్ని ఏం చేయలేవు. ఈ విషయాన్ని 2018 సినిమా మనకు తెలియజేసింది.

                                                                                                                         — Rudra Veni Andaluri–

THE GREAT INDIAN KITCHEN TELUGU: మన వంటింటి కథే…!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *