Fisher Girl Telugu
నాను ఎర్రమ్మని మా వాడంతా ఎర్రి అని పిలుస్తారు. మాది సముద్రాన్నానుకుని ఉన్న జాలారి పేట. 8వ క్లాస్ వరకు సదివినాను. నా పదారో యేట మనువు కుదుర్సారు. మా ఇంటోళ్ళంతా ఏ సెడలవాట్లు లేవు సానా మంచోడు అల్లుడు అని తెగ సంబరపడిపోయారు. నాను కూడా వెర్రి సంతోషంలో మునిగిపోయాను. అందరూ నెత్తినెట్టుకున్నారు. ఎంతగా అంటే నాను కంప్లైట్ సేసినా పట్టించుకోనంత.
నా పెనిమిటి స్టీల్ ప్లాంట్‌లో కాంట్రాక్టు కూలీ. ఉన్నంతలో లోటు నేదు. నాతో పాటు కట్నాలు కానుకలు అన్నీ పంపారు. కాలం గడిసిపోతావుంది. ఓ నాడు నాను బోరు దగ్గర నీళ్ళకి ఎళ్ళినపుడు పక్కింటి కుర్రోడు బిందెత్తాడు.
అది సూసిన నా పెనిమిటి ఎర్రెత్తిపోయాడు. చితక్కొట్టాడు. రోజూ ఆన్ని సూత్తననీ, నవ్వుతున్నానీ ఇలా రకరకాల అనుమానాలతో యేధించడం మొదలెట్టాడు. నా పెనిమిటి కర్రిగుంతాడు.
నానెపుడు అలా అనుకోనేదు, కానీ ఆడి మనసులో నాను కర్రిగుంతాను. ఆ పక్కింటోడు తెల్లగుంతాడు.
Fisher Girl నాను ఎర్రమ్మని
ఆడి మీద మనసెల్లిపోనేదేమోనని అనుమానం. నానేటి సేత్తాను. సెప్పి సెప్పి సత్యప్రమాణాలు సేసి సేసి
అలసిపోనాను. ఆడు కొట్టే బెల్ట్ దెబ్బలకు వల్లంతా హూనమైపోయేది.
ఆడు ఊళ్లో నలుగురికి తగాదా సెప్పె పెద్ద మడిసి. కట్టమంటే సాయం సేత్తాడు. నాను యేటి సెయ్యాలా, ఎవరకి సెప్పుకోవాలా కడకి నానోపలేక ఇక మా ఊరోచ్చే మహిళా సంఘం అక్కకు నా గోసంతా సెప్పుకున్నాను.
అక్క నా పెనిమిటినీ కూసోబెట్టి సెప్పాల్సిందంతా సెప్పింది. మెత్తగా సెప్పింది. గట్టిగా సెప్పింది. దెబ్బ పడిందా ఊరుకునేది నేదని తెగేసి సెప్పింది. కొన్నాళ్ళు సానా బాగా గడిసింది. సిన్న సిన్న గొడవలు ఉన్నా. కొట్టనేదు. ఇద్దరు పిల్లలు. ఇంట్లో బయట పనులన్నీ నానే చేసేదాన్ని.
Fisher Girl నాను ఎర్రమ్మని
నా పెనిమిటి సెప్పిన పనులన్నీ సేసేదాన్ని. అత్త నేదు. ఆడపడుచుల పురుళ్ళు, బాధలు, బాధ్యతలు మామే సూడాలా. సిన్న ఆడపడచు మొగుడు తాగుబోతు. ఆయమ్మ బాధ్యతలన్నీ మామే సూత్తన్నాము. నాను ఆయమ్మ ఒకేసారి కడుపుతో ఉన్నాం. నాను ఒక నెల ముందు.
అందువలన నాను నా పుట్టింటికెళ్లనానికి కుదరనేదు, మా యమ్మ కొన్నాళ్ళు వచ్చి సూసింది. బాలింతగానే ఆడపడుచుకిఅన్నీ అమర్చేదాన్ని. నా వొల్లు సరిలేకో, పాపని సూసుకునో ఏదన్నా సిన్న లోటు జరిగితే గొల్లి గొల్లి పెట్టేది. నా పెనిమిటి వచ్చాక సివాట్లు తినేదాన్ని.
Fisher Girl
నాను మడిసినే కదా. కూసింత సాయం సేయనేదెప్పుడు. నాకు అలవాటైపోనాది. నాను బాధపడతన్నానని తెలిస్తే అమ్మ సానా ఇదయ్యిపోయిద్ది. మా అయ్య సిన్నప్పుడే పోనాడు. అమ్మే మా ఇద్ధరన్నలని, అక్కని, అవిటి సెల్లెలిని, నన్ను ఎండు సేపలమ్మి సాకింది. ఎండకి ఎండింది. వానకి తడిసింది.
వీధులు తిరిగింది. ఊళ్ళు తిరిగింది. సానా కట్టాలు పడింది. నా రెండో కాన్పయ్యాక క్యాన్సర్ జబ్బుతో పోయింది. ఇక నా పెనిమిటిని అడిగే వాళ్లు అడ్డుకునేవాళ్లు నేరు.
కట్టాలు నన్నిడిసిపెట్టలేదు. ఉద్యోగం రూపంలో కొత్త కట్టం వచ్చి సేరినాది. నా పెనిమిటి వాడలో ఒక ప్రైవేటు పోర్టు వచ్చినాది. ఆ పోర్టు వత్తే జాలార్లకు సముద్దరం కాకుండా పోతాదని. సేపలకు నీళ్ళు నేపోతే ఏటైతదో మా జాలర్లకు సముద్దరం నేపోయినా అంతే. యేట సేయడానికవ్వదని సానా పోరాడారు. కానీ పెబుత్వం ముందు మా బలం సరిపోనేదు.
Fisher Girl నాను ఎర్రమ్మని
మాలో ఒకల్ని పోలీసు తూటాలకి బలిచ్చి పోర్టు కట్టినారు. ఇపుడక్కడ సముద్దరం అవుపడదు. ఉపాధి పోయినోళ్ళకు పోర్టులో కొన్ని పనులిచ్చారు. మాకేటి సదువా సంద్యా. స్వీపర్ల పని. నా పెనిమిటికొచ్చిన పని నాకేయించాడు.
బండి నేర్పాడు. పాత బండొకటి కొనిచ్చాడు. మా వాడలో అందరూ నా పెనిమిటినీ తెగ మెచ్చుకున్నారు. నానెంతో అదుట్టవంతురాలినంటారు. నా పిల్లలని పక్కింటోళ్ళకి వదిలిపెట్టి నాను డూటీ సేత్తన్నాను. ఊళ్ళోనే ఆడపడచు పట్టింపుసేసుకోదు.
కానీ నా పెనిమిటి నా జీతంతో ఆల్ల సెల్లి కుటుంబాన్ని సూడాల ఆల్ల పిల్లలని సదివించాలాంటాడు. ఓ పాలి సంఘం అక్కకు ఈ మాటే సెపితే. ఆ ఉద్దోగమేదో మీ సెల్లికేయించవలసిందిగా అంది. మా సెల్లి పని సేయనేదని సెప్పాడు. మరో ఇంటి ఆడపిల్ల పనిసేయగలదా? ఆ ఆలోసన అన్నేయమని సెప్పింది. కొన్నాళ్ళు పిల్లలని సదివిత్తాను. అని సెప్పుకొచ్చాడు.
Fisher Girl నాను ఎర్రమ్మని
సర్నే అని నాను పనికెళ్తన్నా. ఓనాడు బాగా కొట్టాడు. ఇసయం సెప్ననేదు. అక్క సెప్పితే తెలిసినాది. నాను ఎవరితోనో మాటాడుతున్నానని. క్యాంటీన్ దగ్గర కలిసి అన్నం తింటన్నానని. ఒకచోట పనిసేసేటప్పుడు చుట్టూ ఉన్నోళ్ళతో మాటాడ్డం తప్పేనా? తెల్లారితే నా పెనిమిటి దగ్గరకి మా వాడలోని ఎవరో ఒక ఆడమనిసి వత్తనే ఉంటది సాయం కోరి. సుట్టున్న ఆడోళ్ళతో ఎకపసెక్కాలాడినా నాకేటి అనిపించదు.
నా మీద నమ్మకం నేదు. తప్పు సేయాలంటే ఎంతసేపు. సంఘం అక్క సెప్పింది తాపీ ధర్మారావనే పెద్దమడిసి పూర్వం ఆడోళ్ళకు ఇనుప కచ్చడాలు వేసేవారని, తాళాలు వేసేవారని. ఇయ్యాల అయి లేపోయినా ఆడకుతుళ్ళం ఆటికి నిబద్దలుగానే బతుకుతున్నాం.
అయినా పాతివత్య సట్రం మా సుట్టూ తిరుగుతూనే ఉంటాది. అన్ని యిచ్చి నానెద్దులాగా కట్టబడినా, దెబ్బలుతిన్నా, అవమానాలు బరిత్తున్నా ఇంకా ఆ పెనిమిటి కుటుంబం పిల్లలు కావాలనే ఆరాటం. ఆలనీ, ఈలనీ పిలిసి ఎంతకాలం సద్దుకోవాల? నాను మడిసినే కదా
ఇది ఎర్రమ్మ కథొక్కటే కాదు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల, కులాల, మతాల మహిళలది. కాలం స్పీడుగా పరిగెడుతుంది. పరిస్థితులు మారిపోతున్నాయి. అవసరాలు తరుముతున్నాయి.
భార్య భర్త పనిచేసుకోక తప్పని స్థితి. ఇది వరకటిలా మహిళలని నాలుగ్గోడలకే పరిమితం చేస్తాం అంటే వీలుకాని పరిస్థితి. ఏ ఒక్కరు ఆగిపోయినా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులనెదుర్కొవలసి వస్తుంది. సంక్షోభాలు సంభవిస్తే మరింత దుర్భరంగా వుంటుంది. నిత్యం చూస్తూనే ఉన్నాం.
Fisher Girl నాను ఎర్రమ్మని
అనుభవిస్తూనే ఉన్నాం. అయినా మగవాళ్ళు ఎప్పుడో తాతలు, తండ్రులు ఇచ్చిన బూజుపట్టిన భావజాలాలను మోస్తూ బంధాలను, సంబంధాలను మరో సంక్షోభంలోకి నెట్టుకుంటున్నారు.
మహిళలు ఇంటా బయట పనులు చక్కబెట్టుకునే సమర్ధత వున్నవాళ్ళు. 75 శాతం కుటుంబ బాధ్యతలను మోస్తున్నారీనాడు. కానీ వాళ్ళని కనీసం సాటి మనిషిగా కూడా చూడ్డం లేదు. తోటి మనిషి పట్ల అందునా భార్య పట్ల అన్యాయంగా వ్యవహరించడం క్షమించరాని నేరం. ప్రజాస్వామికంగా మెలగడం కనీస ధర్మం.
Annapurna.
Nice
Thank you..
ప్రస్తుత సమాజంలో ఆడవారి పరిస్థితులు ఎలా ఉన్నాయో, వారి మనసులో ఎంత బాధ ఉంటుందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మీరన్నది నిజమే మగవాళ్ల ప్రవర్తనలో, ఆలోచనా విధానంలో మార్పు రానంత వరకు ఆడవాళ్ల బ్రతుకులు ఇంతే. మీరు చాలా చాలా బాగా రాసారు.
Thank you so much..
ఇదొక విషవలయం. దీనిలో చిక్కుకొని ఎంత మందో స్త్రీలు బయటకు రాలేక పోతున్నారు.