Menu

పోరాడి గెలిచిన..గే ప్రొఫెసర్

gay professor

కొంతమంది జీవితాలు అర్ధాంతరంగా విషాదంగా ముగిసిపోవచ్చు. కానీ వారి జీవితంలో ఓ పోరాటం ఉన్నప్పుడు.. అది పదిమందికి ఉపయోగపడేది అయినప్పుడు.. ఆ పోరాటం నుంచి కొన్ని విలువైన ప్రశ్నలను సమాజంపై సంధించినప్పుడు…ఆ జీవితాలకు ఓ ఔచిత్యం ఏర్పడుతుంది. అలాంటి జీవితమే  ప్రొఫెసర్ రామచంద్ర సిరాస్‌ది.

రామచంద్ర సిరాస్ గురించి ఎవరికీ పెద్దగా తెలియకపోయుండొచ్చు. మన తెలుగు వాళ్లకు తెలిసే ఛాన్స్ చాలా తక్కువ.

రామచంద్రా సిరాస్ ఓ మరాఠి ఫ్రొపెసర్. గే ప్రొఫెసర్‌గా చరిత్రలోకెక్కిన వ్యక్తి. ఆయన పర్సనల్ లైఫ్‌ బెడ్‌రూమ్‌‌‌ను దాటి కోర్టు మెట్లు ఎక్కింది. అందులో ఆయన విజయం కూడా సాధించాడు. కానీ అంతకన్న ముందు ఆయన్ని మృత్యువు కబలించింది.

ఈయన జీవితం అలిఘర్ పేరుతో బాలీవుడ్‌లో బయోపిక్‌గా తెరకెక్కింది. అందులో మనోజ్ వాజ్‌పేయ్ రామచంద్రా సిరాస్ పాత్రను పోషించాడు.

బయోపిక్‌గా తీసేంతగా రామచంద్ర సిరాస్ జీవితంలో ఏముంది అని ప్రశ్నించుకుంటే.. సుదీర్ఘ ఘర్షణ ఉంది. పోరాటం ఉంది. ఏ మాత్రం మానవత్వాన్ని ప్రదర్శించని సమాజం కూడా ఉంది. దాంతోపాటు విజయం, ప్రేమ కూడా ఉన్నాయి.

Ramachandra Siras 

రామచంద్ర సిరాస్ ఆషామాషీ ప్రొఫెసర్ కాదు. ఎంతో టాలెంట్ ఉన్న వ్యక్తి. అలీఘర్ ముస్లీం విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. మోడరన్ ఇండియన్ లాంగ్వేజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్. ఒక రచయిత.

రామచంద్ర సిరాస్ 1948లో పుట్టారు. ఈయన నాగ్‌పూర్‌లోని ఓ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత నాగ్‌పూర్ విశ్వవిద్యాలయంలో మనస్తత్వ శాస్త్రం, భాషా శాస్త్రాల్లో చదువుకున్నారు.

1985లో మరాఠీలో డాక్టరేట్ పొందారు. సైకాలజీలో పీజీ చేశారు. 1988లో అలీఘర్ ముస్లీం యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు. సిరాస్ మరాఠీ భాషలో చిన్న కథలు రాశారు. 2000లో మహారాష్ట్ర సాహిత్య పరిషత్ నుంచి ‘‘పయా ఖల్చి హిరావాల్’’ (నా అడుగుల కింద గడ్డి) అనే కథకు సాహిత్య పురస్కారాన్ని అందుకున్నారు.

gay professor

సిరాస్ చినప్పుడు ఫిట్స్ వ్యాధితో బాధపడేవారు. దీంతో డాక్టర్లు పెళ్లి చేసుకోవద్దని చెప్పేవారు. అయితే తర్వాత జీవితంలో ఫిట్స్ తగ్గడంతో  సిరాస్ చాలా లేట్‌గా పెళ్లి చేసుకున్నారు.

ఆ పెళ్లి 20 ఏళ్ల  పాటు కొనసాగింది. తర్వాత ఇద్దరి మధ్య సమస్యలు రావడంతో చాలాకాలం విడివిడిగా ఉన్నారు. ఆపై విడాకులు తీసుకున్నారు. సిరాస్ పాట హింది సినిమా పాటలను ఇష్టపడేవారు. చాలా సింపుల్‌గా జీవించేవారు.

gay professor

రామచంద్ర సిరాస్ జీవితంలో ఓ చీకటి అధ్యాయం ఉంది. అదే స్వలింగ సంపర్క వివాదం.  ఇదే ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యేలా చేసింది. ఓ రిక్షా పుల్లర్‌తో సిరాస్‌కు సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో పెద్ద దుమారమే చెలరేగింది. అప్పట్లో ఆ విషయం పెద్ద సంచలనమే అయింది.  దుష్ప్రవర్తన పేరుతో యూనివర్సిటీ రామచంద్ర సిరాస్‌ను  సస్పెండ్ చేసింది.

Gay

సిరాస్‌కు వ్యతిరేకంగా యూనివర్సిటీలో విద్యార్థులు, అధ్యాపకులు సైతం క్యాంపెయిన్ చేశారు. సిరాస్ సంస్కృతి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని, ఇటువంటి చర్యలు ఎయిడ్స్ లాంటి వ్యాధులకు దారితీస్తాయని ప్రచారం చేశారు. దీంతో రామచంద్ర సిరాస్ డిప్రెస్ అయ్యారు.

gay professor

అయితే సిరాస్ సస్పెన్షన్‌ను తేలికగా తీసుకోలేదు. దీనిపై కోర్టులో కేసు వేశారు. అలహాబాద్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారు. అనతి కాలంలోనే ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. సిరాస్ పదవీ విరమణ చేసేవరకూ తన వసతితో పాటు ప్రొఫెసర్‌గా తన ఉద్యోగాన్ని తిరిగి పొందారు.

అతని పదవీ విరమణ వరకూ ఉద్యోగంలో కొనసాగవచ్చని కోర్టు తీర్పునిచ్చింది. స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణించే భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377 ఆధారంగా ఈ కేసు విచారణ సాగింది. సిరాస్‌ను తిరిగి ఉద్యోగంలో చేరాలనే ఉత్తర్వులు సిరాస్ చనిపోయిన మరుసటి రోజు అందాయి.

gay professor

అనుమానస్పద స్థితిలో సిరాస్ చనిపోయారు. తన అపార్ట్‌మెంట్లో సిరాస్ ప్రాణాలు విడిచారు. దీనిని పోలీసులు ఆత్మహత్యగా భావించారు. అయితే పోస్టమార్టంలో అతని శరీరంలో విషం ఉన్న ఆనవాళ్లు ఉన్నట్టు తేలింది. తర్వాత హత్య కేసు నమోదు చేశారు. ఆరుగరిని అరెస్ట్ చేశారు.

ముగ్గురు జర్నలిస్టులను, నలుగురు AMU అధికారులను ఈ నేరంలో భాగంగా చేర్చారు. అయితే తగిన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసును క్లోజ్ చేయడం జరిగింది. అలా సిరాస్ మరణం వెనుక ఉన్న వాస్తవం నేటికి మిస్టరీగా మిగిలిపోయింది.

gay professor

సిరాస్‌‌ని భౌతికంగా ఎవరు దూరం చేశారనేది రహస్యంగానే ఉండిపోయుండొచ్చు. కానీ మానసికంగా ఎవరూ కృంగదీశారనేది మాత్రం సుస్పష్టం.

సమాజంలో ఉన్న వివక్షత ఆయన్ని వెంటాడిది.. వేటాడింది. అనుక్షణం కృంగిపోయేలా చేసింది. ఏ మనిషికైనా ఏ తప్పు చేయకుండా శిక్ష పడితే ఎలా ఉంటుంది…? ఆ వ్యథే.. సిరాస్ జీవిత కథ. ఆ బాధను ఆయన చాలాకాలం మోయాల్సి వచ్చింది.

మనకు నచ్చనంత మాత్రాన ఏ మనిషిలోని పాజిటివ్స్… నెగిటివ్స్‌గా మారిపోవు. సడన్‌గా ఓ వ్యక్తి అంగవైకల్యం చెందినంత మాత్రాన ఆయనలోని ప్రతిభ కనుమరుగైపోదు. కానీ మనం చూసిన వ్యక్తిలో సడన్‌గా ఓ లోపం కనిపిస్తే తనపై ఉన్న ప్రేమ, గౌరవాలు మాత్రం మాయమైపోతాయి.

అదెలా సాధ్యం అంటే మన సమాజంలో ఉన్న రుగ్మతలే దానికి కారణం. మనుషుల్లోని ఫిజికల్‌గా ఏర్పడే లోపాలు.. ఎవరూ తమకు తాముగా కావాలనుకోరు. జన్యు లోపాల వల్ల అలా జరగొచ్చు. దానికి ఆ మనిషిని శిక్షించి, వేధించి, పరిహాసించి తరిమి తరిమి కొట్టడం ఎంతవరకు సమంజసం…? ఇదే ప్రశ్న సిరాస్ విషయంలో ఈ సమాజం ముందు ఉంది.

అయినా ఎవరి వ్యక్తిగత జీవితంలోకి జొరబడే హక్కు ఎవరికీ లేదు. ఆ మనిషి సమాజానికి హాని కలిగిస్తే తప్ప. నేచురల్ సెక్స్ లాగానే స్వలింగ సంపర్కం కూడా బయోలాజికల్ ఇన్‌స్టింక్ట్.

మన సమాజం పెట్టుకునే రూల్స్‌కు విరుద్ధంగా ఉంటే అది నేరం అయిపోతుందా..? బహుశా సిరాస్ జీవితం ఇలాంటి ఎన్నో ప్రశ్నలను మన ముందు ఉంచిది.

కొన్ని సున్నితమైన విషయాల పట్ల అంతే సున్నితంగా స్పందించడం, వ్యవహరించడం చాలా అవసరం. దానికి మన ఆలోచన తీరును కొంచెం మార్చుకోవాల్సి ఉంటుంది.

 I spent two decades here. I love my University. I have always loved it and will continue to do so no matter what. But I wonder if they have stopped loving me because I am gay – Siras

మహిళా సైంటిస్ట్ మేధో శ్రమ దోపిడి : డీఎన్ఏ@రోసలిండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *