స్వతంత్ర సమర యోధుల్లో భగత్ సింగ్ అందరికీ తెలుసు.. కానీ ఆయనలాంటి వాళ్లకు బాటలు వేసిన నాయకులు ఎవరో తెలుసా..? భగత్ సింగ్ కంటే ముందే ఉరికొయ్యలను ముద్దాడిన వీరులెవరో తెలుసా..? ముస్లిం అంటే చాలు ఉగ్రవాది అనే భయం ఉన్న ఈ సమాజానికి స్వేచ్ఛనిచ్చిన యోధుల్లో ముస్లింలు ఉన్నారని తెలుసా..? దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన అష్పాకుల్లా ఖాన్ (Indian Freedom fighter Ashfaqulla Khan) గురించి తెలుసా..?
అష్పాకుల్లా ఖాన్ భారతీయ స్వతంత్ర సమర యోధుడు (Indian Freedom fighter Ashfaqulla Khan). దేశం కోసం 27 ఏళ్లకే ప్రాణాలు అర్పించిన వ్యక్తి. భగత్ సింగ్, ఆజాద్ చంద్రశేఖర్, సుఖదేవ్, రాజ్‌గురు, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరిలోనో స్ఫూర్తిని నింపిన వీరుడు. అష్పాకుల్లా ఖాన్ త్యాగంతో భారత దేశం విముక్తికి దారులు పడ్డాయి. అష్పాకుల్లా ఖాన్ అసలు సిసలైన విప్లవకారుడు.
అష్ఫాకుల్లా ఖాన్ ఉత్తర్ ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో అక్టోబర్ 22, 1900వ సంవత్సరంలో జన్మించాడు. ఆయన తండ్రి షఫీకుర్ రెహమాన్ పొలీసు శాఖలో పనిచేసేవాడు. తల్లీ మజ్హరున్నీసా.
ఆ దంపతుల ఆరుగురు సంతానంలో అష్ఫాకుల్లా చివరివాడు. 1919లో మహాత్మా గాంధీ సహాయనిరాకరణోద్యమం ప్రారంభించినప్పుడు అష్ఫాక్ యువకుడు అప్పటికీ చదువుకుంటున్నాడు.
అయితే చౌరీచౌరా ఘటన తర్వాత మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్నిఅర్ధాంతరంగా నిలిపివేశారు. స్వతంత్రం కోసం దేశ ప్రజలంతా గాంధీపైనే ఆశలు పెట్టుకుని ఆయన వెంటే నడుస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని అనేక మంది యువకులు నిరాశ చెందారు.
అలాంటి యువకుల్లో అష్ఫాక్ ఒకడు. గాంధీ అనుసరిస్తున్న విధానాల వల్ల దేశానికి స్వతంత్రం రాదని, వచ్చినా అది అధికార మార్పిడిలానే ఉంటుందని అష్పాక్ భావించాడు. సాయుధ పోరాటంతోనే నిజమైన స్వేచ్ఛ సాధ్యమని నమ్మి విప్లవకారులతో చేరాడు. ఈ సమయంలోనే షాజహాన్‌పూర్‌కు చెందిన ఉద్యమకారుడు రాంప్రసాద్ బిస్మిల్‌తో పరిచయం ఏర్పడింది.
ఆర్య సమాజ్ సభ్యుడైన రాంప్రసాద్ బిస్మిల్‌తో ముస్లిం మతస్థుడైన అష్ఫాకుల్లా ఖాన్ (Ashfakulla khan)స్నేహం కొంత విభిన్నమైనదే.
దేశ ప్రజల స్వేచ్ఛ , పేదల విముక్తి అనే లక్ష్యం వారిద్దరినీ కలిపింది. అష్ఫాక్ మంచి కవి, హిందీ, సంస్కృతం, ఉర్డూ, పారసీ భాషల్లో దిట్ట. అన్ని భాషల్లోను ఎన్నో పుస్తకాలు చదివాడు.
ఆర్థికంగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టినా ఆయన ఆలోచనలు, అధ్యయనం అంతా పేదల జీవితాల్లో వెలుగులు నింపడం కోసమే ఉపయోగించాడు. పేదరికం నుంచి విముక్తి చేయడం కోసమే. ఉర్దూలో ఆయన రాసిన కవిత్వం భాషపై ఆయనకున్న పట్టు, ప్రేమకు సాక్ష్యం అని చెప్పవచ్చు.
ఆ ఆలోచనలు, అభిరుచిలే.. రాంప్రసాద్ బిస్మిల్, అష్పాకుల్లా ఖాన్ స్నేహం (Ashfakulla Khan , Ram Prasad Bismil Friendship) మరింత బలపడడానికి కారణమైంది. చివరికి ప్రజల కోసం తాము నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగంలోనూ ఐక్యత చాటుకున్నారు. ఇద్దరూ ఒకే రోజు, వేర్వేరు జైళ్లలో ప్రాణాలు అర్పించారు.
అష్పాకుల్లా ఖాన్ (Ashfakulla Khan ) దేశ స్వతంత్రం కోసం గాలివాటుగా కాదు.. ప్రణాళికబద్ధంగా సాగాడు. దానికోసం విప్లవ సంఘంలో భాగమయ్యాడు.
దేశం కోసం సచీంద్రనాథ్ సన్యాల్, నరేంద్ర మోహన్ సేన్, ప్రతుల్ గంగూలి మరికొంతమంది కలిసి హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంఘాన్ని 1924 ఏర్పాటు చేశారు. రష్యాలోని బోల్షివిక్ పార్టీ ప్రేరణతోనే బెంగాల్లోని బోలాచాంగ్ అనే గ్రామంలో ఈ విప్లవ సంస్థ రూపుదిద్దుకుంది.
ఈ సంఘం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలను అన్యాయంగా హింసిస్తున్న అధికారులను మట్టుబెట్టడం వంటి పనులు చేసేవారరు.
ఈ పనులు యువతను తీవ్రంగా ఆకట్టుకున్నాయి. దీంతో రాం ప్రసాద్ బిస్మిల్ (Ram prasad bismil), అష్పాకుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్, సుఖదేవ్, రోషన్ సింగ్, రాజేంద్ర లాహిరి వంటి వాళ్లు వెంటనే ఈ సంఘంలో చేరారు. ఆ తర్వాత కాలంలో ఈ సంస్థను చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ నేతృత్వంలో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌గా మార్చారు.
తమ ఉద్యమం నడవడానికి కావాల్సిన ఆర్థిక వనరులు ఏ విధంగా సమకూర్చుకోవాలోననే విషయంపై ఉద్యమకారులు 1925, ఆగష్టు 8 న షాజహాన్‌పూర్లో ఒక సభను నిర్వహించారు. చాలా చర్చలు అనంతరం రైళ్లలో రవాణా చేసే ప్రభుత్వ ఖజానా దోచుకోవాలని నిర్ణయించారు.
ఆగస్టు 9న అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్, రాజేంద్ర లాహిరి, ఠాకూర్ రోషన్ సింగ్, సచీంద్ర బక్షీ, చంద్రశేఖర్ ఆజాద్, కేశవ్ చక్రవర్తి, బన్వారీ లాల్, ముకుంది లాల్, మన్మథనాథ్ గుప్త కలిసి కాకోరీ (kakori case) గ్రామం వద్ద ప్రభుత్వ ఖజానాను తీసుకెళ్తున్న ప్యాసింజర్ రైలును దోచుకోవాలని పథకం రచించారు. అందులో భాగంగా సాధారణ ప్రయాణికుల్లా వాళ్లు ఆ రైలు ఎక్కారు.
రాజేంద్ర నాథ్ లాహిరి కాకోరి రాగానే గొలుసు లాగి రైలును ఆపాడు. పథకంలో భాగంగా అప్పటికే పొదల్లో దాక్కున్న అష్ఫాఖుల్లాఖాన్ వెంటనే రైలుఎక్కాడు.
తనదగ్గరున్న జర్మనీ మేడ్ ఫిస్టల్ (మాజర్)ను తీసి డ్రైవర్ తలకు గురిపెట్టాడు. భారతీయులెవరూ భయపడొద్దని, ఎవరినీ చంపాలనేది తమ ఉద్దేశం కాదని చెప్పి ప్రభుత్వ ఖజానాలోని రూ.8వేలు దోచుకుని పరారయ్యారు.
ఈ ఘటన అనంతరం బాధ్యుల కోసం బ్రిటిష్ అధికారులు వేట మొదలు పెట్టారు. మొదట రాంప్రసాద్ బిస్మిల్‌ను పట్టుకున్నారు. తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ తప్ప అందరూ పట్టుపడ్డారు.
అష్ఫాక్ మాత్రం పోలీసులకు దొరకలేదు. అజ్ఞాతంలోనే బీహార్ నుంచి బనారస్‌కు వెళ్లి అక్కడ పది నెలలపాటు ఒక ఇంజనీరింగ్ కంపెనీలో పనిచేశాడు. రష్యా వెళ్లి అక్కడి నుంచి ఉద్యమానికి సహాయ పడాలని నిర్ణయించుకున్నాడు. దానికి మార్గాలు అన్వేషిస్తూ ఢిల్లీ చేరాడు. అక్కడ తన బాల్య మిత్రుడు పఠాన్‌ను ఆశ్రయించాడు.
అయితే ఆ స్నేహితుడు అష్ఫాక్ ను నమ్మించి పోలీసులకు పట్టుపడేలా చేశాడు. అష్ఫాకుల్లా ఖాన్‌ను ఫైజాబాద్ జైల్లో బంధించి కేసు నమోదు చేశారు. అష్ఫాక్ పెద్దన్న రియాజతుల్లా ఖాన్ చివరి వరకు అష్ఫాక్ తరఫు న్యాయవాదిగా వాదించాడు. కాకోరీ కుట్ర కేసులో అష్ఫాకుల్లా ఖాన్‌కు ఉరి శిక్ష విధించారు.
అష్ఫాకుల్లా ఖాన్‌ను 1927, డిసెంబర్ 19న ఉరితీశారు. ఏడు కోట్ల ముస్లింలలో దేశ స్వాతంత్య్రం కోసం ఉరికంబాన్ని ఎక్కబోతున్న మొట్ట మొదటి అదృష్టవంతుడుగా గర్వపడుతున్నాను’ అంటూ అష్ఫాఖుల్లా ఖాన్ ఉరితాడును ముద్డాడి మెడలో తానే వేసుకున్నాడు. షాజహాన్‌పూర్‌లోని ఆయన సమాధి ఇప్పుడు ఒక స్మారక స్థలంగా మారింది.
ఈ వీరుల గాధను 2006 రంగ్ దే బసంతి (ashfaqulla khan rang de basanti) పేరుతో హిందీలో సినిమా తీశారు. అందులో అష్ఫాఖుల్లా ఖాన్‌గా కునాల్ కపూర్ నటించాడు.
నా దేశ సోదరులారా..! మీరు మొదట భారతీయులు. ఆ తర్వాతే వివిధ మతాల వారు. మీరే మతం వారైనప్పటికీ పరస్పరం కలహించుకోకండి. ఐకమత్యంతో ఆంగ్లేయులను ఎదిరించండి. దేశ విముక్తే మన లక్ష్యం కావాలి.
అష్ఫాఖుల్లా ఖాన్
సూర్యం..
లెస్బియన్ కుంచె నుంచి అద్భుత పెయింటింగ్స్
[…] దేశం కోసం ప్రాణం వదిలిన తొలి ముస్లిం :… […]