itlu amma telugu movie review
ఇట్లు అమ్మ .. సామాజిక విలువలను గుర్తింపచేసిన అరుదైన సినిమా (Movie). ఇటీవల ఈ సినిమా ఓటీటీ మీడియాలో (OTT) రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో నటి రేవతి (Actress Revathi) అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు.
ఈ ప్రపంచంలో అమ్మ కంటే సున్నితంగా ఇంకెవరు చెప్పగలరు. అందుకే డైరెక్టర్ ఈ కథకు అమ్మనే ప్రధాన పాత్రగా ఎంచుకున్నారు.
కొడుకే లోకంగా బతికిన ఓ తల్లికి కొడుకు మరణంతో పోరాటం అనివార్యమైంది. అందుకే సమాజాన్ని దగ్గరగా చూడటం మొదలుపెట్టింది. చదవటం ఆరంభించింది. ఆ అవసరం ఆ తల్లికి ఎందుకు కలిగిందో అందరూ చూడాల్సిందే.
సొసైటీలో చాలామంది పక్కింట్లో వాళ్లని సైతం పలకరించలేని, చుట్టూ ఏం జరిగినా పట్టించుకోనంత బిజీగా తమలోని భావావేశాలను మంచినీ, చెడునీ, సేవనీ, జాలినీ, కరుణనీ అన్నిటినీ సోషల్ మీడియాకే పరిమితం చేస్తున్నారు.
లైక్‌లు కొట్టడంతో బాధ్యత, ఒక వీడియోనో ఫోటోనో అప్‌లోడ్ చేసి సోషల్ రెస్పాన్సిబిలిటీ పూర్తైనట్టు ఫీల్ అవుతున్నారు.
itlu amma telugu movie review
కానీ కష్టం మీద పడినప్పుడు, నష్టం జరిగిపోయినప్పుడు ఓదార్చే మనిషి పక్కన లేకపోతే ఉండే బాధ చెప్పలేం. అప్పుడే ఎంత ఒంటరిగా ఉన్నామో తెలుసొస్తుంది.
ఎప్పుడూ కొంతమందే ఈ సమాజ బాగు కోసం త్యాగాలు చేస్తున్నారు. ఫలితాలు అందరూ అనుభవిస్తుంటారు. అందరూ తమలోని కొంత స్వార్థాన్ని వదులుకుంటే ఎంత మంచి ఫలితాలు అనుభవించచ్చో సమాజాన్ని ఎంత అద్భుతంగా మార్చవచ్చో సింపుల్‌గా చెప్పిన సినిమా.
itlu amma telugu movie review
ఓ తల్లీ కొడుకు ఒక అపార్ట్‌మెంట్‌లో ఉంటారు. అదొక బ్రాహ్మణ కుటుంబం. ఇల్లు ఆఫీసు తప్ప వేరే లోకం తెలియని బుద్ధిమంతుడైన కొడుకు. కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటుంది. ఆ రోజు తుఫాను. కొడుకు ఇంటికి రాడు. ఎదురుచూపులతో కాసేపు గడిపి పక్కింటివాళ్లకి తన ఆందోళన చెప్పుకుంటుంది.
వర్షం కదా ఎక్కడైనా ఆగడేమో కంగారు పడకండని పక్కింటామే ధైర్యం చెబుతుంది. అయినా ఆ తల్లి మనసు ఆగదు. వాచ్‌మెన్‌కి కీ ఇచ్చి వెతకడానికి వెళ్తుంది. చీకట్లో రోడ్ మీద బెరుకు బెరుకుగా వెతుక్కుంటూ వెళ్తుంది.
ఆఫీసులో అడిగితే రోజూ టైంకే వెళ్లిపోయాడని చెబుతారు. మేనేజర్ ఇంటికెళ్తే ఆయన చాలా కంగారు పడి పక్కనే పోలీస్ స్టేషన్‌కి వెళ్దామంటాడు. కానీ ఇంట్లో వాళ్లు ఒప్పుకోరు. దాంతో అడ్రస్ ఇచ్చి ఆమెనే వెళ్లమంటాడు.
itlu amma telugu movie review
ఆ అమ్మ అమాయకంగా చూసి మౌనంగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు ఇస్తుంది. సరే అక్కా ఎంక్వరీ చేస్తాను నువ్వెళ్ళు అని ఆ అధికారి పంపిస్తాడు. పొద్దున్నే మళ్ళీ రోడ్ మీద వెతుక్కుంటూ వెళ్తుంది.
ఈలోగా పోలీస్ వచ్చి రమ్మని తీసుకెళ్తాడు. ఒక చోట డ్రైనేజీ నుంచి ఒక బాడీని తీస్తారు. అది గుర్తించమంటారు. ఆమె తన కొడుకు శవాన్ని చూసి కుప్పకూలిపోతుంది.
itlu amma telugu movie review
తన కొడుకుని ఎలా చచ్చిపోయాడు.. ఎందుకు చంపారనే ప్రశ్నలకు సమాధానం కోసం రోజు స్టేషన్ చుట్టూ తిరుగుతుంది. ఆ అధికారి ‘‘మాకేం పని లేదా ఇదొక్కటే కేసనుకుంటున్నావా’’ అంటూ హంతకులు ‘‘ఇంకా దొరకలేదు తెలిస్తే మేమె చెబుతామంటూ’’ విసుక్కుని కసిరి అవమానించి పంపిస్తుంటాడు.
కానీ ఆ అమ్మ నాకు హంతకుడెవరో తెలియక్కర్లేదు ఎందుకు చంపారో కారణం తెలిస్తే చాలంటుంది. ఆమెని పిచ్చిదాని లెక్క చూస్తాడు. ఆ సిటీలో ఏం జరిగినా.. గూండా యాదవ్‌కి తెలుస్తుందని పోలీసులే మాటాడుకోవడం విని ఆ గూండా దగ్గరకి వెళ్ళి అడుగుతుంది. ‘‘నా కొడుకుని ఎవరు చంపారో ఎందుకు చంపారో’’ చెప్పమని. అతను తెలియదంటాడు.
అప్పుడే ప్రజా సంఘాల నాయకుడు సత్యం ఆ గూండాతో తగవు పడటాన్ని చూస్తుంది. ఒకరోజు బస్టాండ్ పక్కన రోడ్ మీద సత్యం వాళ్లు ధర్నా చేస్తుంటారు. అక్కడికి పోలీసులొచ్చి వాళ్లందరినీ అరెస్టు చేసి తీసుకెళ్లిపోతారు.
ఆ గలాటలో అక్కడ పెట్టిన పుస్తకాలు పడిపోతాయి. బస్టాండ్‌లో నిలబడి ఇదంతా గమనిస్తున్న ఆ అమ్మ పుస్తకాలు తీయడానికి సహాయం చేస్తుంది. వాటిలో గాంధీజీ సత్య శోధన చూసి కొంటుంది. ఇంటికొచ్చి శ్రద్ధగా చదువుతుంది.
itlu amma telugu movie review
పోలీస్ స్టేషన్లో పరిచయం అయిన ఒక పత్రికా విలేఖరి సహాయం కోరుతుంది. తాను తన కొడుకు కోసం మీడియా ద్వారా హంతకుడికి ఉత్తరాలు రాస్తానని అవి చదివిన హంతకుడు తప్పకుండా తనను కలుస్తాడని బలంగా నమ్ముతుంది. అది విన్న పత్రికా సంపాదకులు నవ్వుతారు.
చివరికి ఒక పత్రికలో అవకాశం ఇస్తారు. ఆ తల్లి తన కొడుకుతో పెనవేసుకున్న అనేక సందర్భాలను ప్రస్తావిస్తూ రాస్తూనే ఉంటుంది. ఎంతోమందిని ఆ ఉత్తరాలు చేరతాయి. హంతకుడిని కూడా కదిలిస్తాయి.
దాంతో అమ్మ రోజూ హంతకుడి నుండి జవాబు వస్తుందనే ఆశతో పోస్టు కోసం, ఫోన్ కోసం ఎదురు చూస్తుంటుంది. రోడ్ పక్కన టీ కొట్టులో వాళ్లు నిత్యం పత్రికలో వస్తున్న ఉత్తరం చదువుతూ ఉంటారు. రోడ్ మీద ఆకలితో తిరిగే అనాధ ఆ కొట్టు దగ్గరకు వెళ్లినప్పుడు వింటాడు. ఇబ్బందిగా వెళ్ళిపోతాడు.
కానీ రోజు పేపర్ దొరకబెట్టుకుని చదువొచ్చిన పిలగాళ్లతో చదివించుకుంటాడు. ఆ అమ్మ బాధకి చలించిపోతాడు. పశ్చత్తాపంతో బాధపడిపోతాడు.
రోడ్ మీద అడుక్కునే అమ్మాయి దగ్గర రూపాయి దొంగలించి ఫోన్ చేస్తాడు. ఆమె తీస్తుంది. కానీ మాట్లాడడు. ఆమెకి అర్ధం అయిపోతుంది. నువ్వేనా..? అని ఆత్రంగా అడుగుతుంది. భయపడి ఫోన్ పెట్టేస్తాడు.
itlu amma telugu movie review
తర్వాత ఆ అబ్బాయి ఆస్పత్రికి వెళ్తాడు. అక్కడ పక్కన కూర్చున్న మరో అనాధ రక్తం అమ్మడానికి వచ్చావా..? నువ్వు నా బాపతేనా..? అంటాడు. తను ఏం సమాధానం చెప్పడు. ఇంతలో డాక్టర్ పిలిచి మలేరియా, టైఫాయిడ్ అని జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.
ఆ జబ్బుతో ఎక్కడెక్కడో తిరిగి ఆమె దగ్గరకొస్తాడు. తలుపు తడతాడు. ఆమె తీస్తుంది. ఆ అనాధను చూడగానే నువ్వేనా అంటుంది. నేనే చంపానమ్మా అని చెప్పి కూలిపోతాడు. వైద్యం చేయిస్తుంది. సేవ చేస్తుంది. లేస్తాడు. ఆమె ఆదరణకు కుమిలిపోతాడు.
అప్పుడు ఆ తల్లీ ఎందుకు ‘‘నా బిడ్డను చంపావు.. వాడేం తప్పు చేశాడు..? ఆ తప్పు ‘‘నేను సరిదిద్దగలనేమో’’ చూస్తాను అంటుంది. అమ్మా నేను అనాధను. రోడ్ మీద ఆకలితో తిరుగుతుంటాను. ఎవరు కనిపిస్తే వాళ్లని అడుగుతాను. ఇవ్వకపోతే లాక్కుంటాను. ఆ రోజు అలాగే మీ అబ్బాయి కనిపించాడు.
itlu amma telugu movie review
తను ‘‘నాకేం ఇవ్వకపోయేసరికి కత్తి దొరికింది పొడిచెసాను’’. ఊరికే అలా చేసేసాను’’. ఒక మనిషి చచ్చిపోతే తన కోసం ఇంకో మనిషి ఇంత బాధ పడతారని నాకు తెలియదమ్మ అంటూ బాధపడతాడు.
అమ్మ కరిగిపోతుంది. తను.. తన కొడుకు బాగుంటే చాలనుకునే ఆ అమాయక తల్లీ.. చుట్టూ సమాజం కూడా బాగుండాలని అప్పుడు అర్థం చేసుకుంటుంది. అతనిని చేరదీసి.. మంచి జీవితాన్ని అందిస్తుంది.
ఆ అమ్మ తన కొడుకు మరణానికి కారణాన్ని అన్వేషిస్తూనే ఒకవైపు అనేక పుస్తకాలు చదువుతుంది. మరోవైపు కొంతమందే అన్యాయాలను ప్రశ్నిస్తుండటం గమనిస్తుంది.
అలా ప్రశ్నిస్తున్న ప్రజాసంఘాల నాయకుడు సత్యం హత్యకు గురవటం చూస్తాది. ఆమె సత్యం భార్యకు అండగా ఉంటుంది. అయినా అన్యాయాలను ప్రశ్నించడం ఎంతో అవసరమని అర్థం చేసుకుంటుంది. తన దారిలో తాను పోవడం కాదు. ఆ దారి పొడుగునా ఎదురైన మనుషుల్ని సమస్యల్ని హత్తుకుంటూ ముందుకెళ్తుంది.
చిన్న చిన్న విషయాల్ని సైతం పట్టించుకోనంత స్వార్థం. మనలోని నిర్లక్ష్యం ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవలసి వస్తుందో చూస్తూనే ఉన్నా కదలిక లేని సమాజాన్ని ఆలోచింపచేయడానికి చేసిన ఓ చిన్న ప్రయత్నం ఈ సినిమా.
itlu amma telugu movie review
ఈ మూవీ డైరెక్టర్ సి.ఉమామహేశ్వర రావుగారు బేసిక్‌గా ప్రగతిశీల భావాలు కలిగిన సామాజిక కార్యకర్త. ఆయన రచనలు, సినిమాలు, సీరియల్స్ అన్నీ ఉన్నతమైన విలువలు గురించి తెలియజేసేవే. అందులో ఒక ఉత్తమమైన సినిమా ‘‘ఇట్లు అమ్మ ’’.
ఈ మూవీ ద్వారా డైరెక్టర్ సి. ఉమా మహేశ్వరరావు గారు అమ్మ చేత ఉత్తరాల రాయించి ప్రస్తుత సమాజానికి ఒక సందేశాన్ని పంపించారు. ఎందుకంటే ఆ ఉత్తరాలు సమాజంలోని ప్రతీ వ్యక్తిని కదిలిస్తాయి.
…అన్నపూర్ణ…
వహ్… ఇర్ఫాన్