Menu

జోహార్‌… డైరెక్టర్‌కి హేట్సాఫ్‌

Johaar Movie Telugu

ఓటీటీ ప్లాట్‌ఫాం ఎక్కిన మరో విలువైన మూవీ జోహార్‌. ప్రస్తుత రాజకీయాలకు అద్దం పట్టింది.  ఓటేసిన కోట్లాది మంది ప్రజల సమస్యలను రెండు గంటల్లో విప్పి చెప్పింది. ఇందులోని ప్రతీ పాత్రలో మనముంటాం లేదా మన పక్కింటోళ్లు ఉంటారు. చూసిన తర్వాత మూవీ మన మెదళ్లలో మళ్లీ మళ్లీ  తిరుగుతుంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతాయి.

ఈ దేశ ప్రతిష్టను పెంచేది కాంక్రీటు నిర్మాణాలు కాదు ప్రజల బాగోగులని ఈ మూవీ నొక్కి చెప్పింది. పెద్దలు తీసుకునే నిర్ణయాలతో పేదల బతుకులు ఎలా బుగ్గిపాలవుతాయో చూపించింది.  పాలకుల నిర్ణయాల వల్ల మనిషికి మంచి తిండిని, ఇంటిని, విద్యా, వైద్యం చివరకు మంచి నీరు కూడా ఎలా అందకుండా పోతున్నాయో చూపించిన చిత్రం.

Johaar Movie Telugu

జీవితంలో తమ శక్తికి మించిన కష్టాన్ని అనుభవించిన వ్యక్తులు తమ పరిస్థితులను మార్చుకోవాలని చేసిన ప్రయత్నంలో ఓడిపోవడం, మనిషికి, మట్టికి, మంచి బతుక్కి  విలువలేని ఈ సమాజంలో ఆత్మహత్యే మార్గంగా ఎంచుకోవడం విషాధమే. ఈ మూవీ చూసాక ‘‘ఈసురోమని మనుషులుటే దేశమేగతి బాగుపడునోయ్‌’’ అన్న గురజాడ మాటలు అక్షర సత్యంగా అనిపిస్తుంది.

తండ్రి రాజకీయ వారసుడిగా అధికారంలోకి వచ్చిన ఒక యువ రాజకీయ నాయకుడు. తన తండ్రిని దేవుడిగా ప్రజల్లో జొప్పించే ప్రయత్నంలో అతి పెద్ద విగ్రహ నిర్మాణానికి పూనుకుంటాడు. ప్రజా ధనమంతా విగ్రహానికి తరలించి ప్రజల జీవితాలను పణంగా పెడతాడు. ఆ క్రమంలో బలైపోయిన వారిని బోస్‌, గంగ, బాల, జ్యోతి రూపంలో చూడొచ్చు.

Johaar Movie Telugu బోస్‌

విలువలనే వలువలుగా ధరించిన ఒక వృద్ధుడు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని అనాథాశ్రమాన్ని ప్రభుత్వం నిధులిస్తే రీ కన్‌స్ట్రక్ట్ చేయాలనుకుంటాడు.

ఆశ్రమంలోని పిల్లలు ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరగాలని ఆరాటపడతాడు. ఓపికగా 20 ఏళ్లు పోరాడినా  నిధులు మంజూరు కావు. కన్నీళ్లతో కరిగిపోతాడు.  మనస్సు, శరీరం విపరీతంగా అలసిపోతాయి. పిల్లల బాల్యం చిగురించాలని ఇన్స్యూరెన్స్‌ డబ్బుకోసం తనని తాను అర్పించుకుంటాడు.

Johaar Movie Telugu

గంగ..

గంగ కిడ్నీ వ్యాధికి నిలయమైన ఉద్దానం ప్రాంతానికి చెందిన ఓ పిచ్చి తల్లి. కిడ్నీ వ్యాధితో భర్త మరణించగా కృంగిపోతుంది. ఆరేళ్ల కూతురు నాన్నేడమ్మా అంటే నీరెత్తుకెళ్లిపోయిందమ్మా అంటుంది. ఆ ప్రాంతంలో నీళ్లు తాగితే  కిడ్నీ వ్యాధికి బలవ్వాల్సిందే. బడిలో కుప్పకూలిపోయిన బిడ్డకి కిడ్నీ వ్యాధి అని తెలిసిన ఆ తల్లి వేదనకు అంతే ఉండదు. కాపాడుకోవడానికి వ్యవసాయం మీద కష్టపడుతుంది. కానీ తుఫాన్‌ రూపంలో పంటనూ నీరెత్తుకెళ్లిపోతుంది. నిధులు లేకపోవడంతో న్యాయమైన నష్ట పరిహారం అందదు. పిల్ల ప్రాణాలు దక్కవు. ఆ తల్లి విషాదంతో సముద్రంలో కలసిపోతుంది.

Johaar Movie Telugu

బాల

బాల సర్కసే జీవనాధారంగా బతికే అనాథ యువతి. ఆమె పరుగులోని కసిని చూసిన ఒక కోచ్‌ దేశానికి వన్నె తెచ్చే అథ్లెట్‌గా తయారు చేయాలనుకుంటాడు. దానికి తగ్గట్టుగా బాల అపారమైన కృషి చేస్తాది. కానీ సరైన పోషణ లేని శరీరం సహకరించదు.
అకాడమీలో స్పెషల్‌ డైట్‌కి రిఫర్‌ చేస్తాడు. నిధుల కొరత వల్ల నాణ్యమైన డైట్‌ అందదు. పోటీలో పడిపోతుంది. ఇక ఎప్పటికీ గెలవలేనన్న నిజం ముందు దేవుడే పోటీకొస్తే నేనే గెలుస్తానన్నంత ఆత్మవిశ్వాసం ఉన్న బాల చావుని వెతుక్కుంటుంది.

Johaar Movie Telugu

జ్యోతి

జ్యోతి వేశ్య కూతురు. తల్లి తనలా తన కూతురు వృత్తిలోనే ఉండాలనుకుంటుంది. కానీ జ్యోతి చదువుతో తన జీవితాన్ని మార్చుకుందామనుకుంటుంది. అమ్మ చెర నుంచి తప్పించుకుని ఒక అబ్బాయితో వెళ్ళిపోతుంది. డాక్టరవ్వాలని కష్టపడుతుంది. కానీ స్కాలర్‌షిప్‌తో పాటు హాల్‌ టికెట్‌ ఆగిపోతుంది. పరీక్ష రాయాలంటే రూంకి రమ్మన్న ప్రిన్సిపాల్‌తో ఈ బతుకొద్దనే ఇంత దూరం వచ్చాను.
చదువు కూడా ఇదే దారి చూపిస్తే  అలాంటి చదువు అవసరం లేదంటుంది. నమ్మిన మనిషి సిద్ధూకి కలిగిన అపార్ధాన్ని తొలగించే  ప్రయత్నంలోనే ఉండగానే ఒక  యాక్సిడెంట్‌ అతనిని కోమాలోకి తీసుకెళ్తుంది. దిక్కుతోచక రైలుకు ఎదురెళ్లుతుంది.
     ప్రపంచంలోనే అతిపెద్ద శిలావిగ్రహాం నిర్మాణానికి ప్రజల నిధులను మళ్లించి వాళ్లని ఆ కట్టడాల నిర్మాణాల కింద సమాధి చేస్తున్నారని రాజకీయ నాయకుడిని నిలదీయడం కొసమెరుపు.

   విస్తృతమైన సామాజిక అంశాన్ని మనుషుల ఏమోషన్స్‌లోకి జొప్పించి.. మెప్పించడం చిన్న విషయం కాదు. అందులో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

                                                                                                                                                                             అన్నపూర్ణ..</p
>

You can Also like these posts also

ఆమె.. కరిగిన ఓ స్వప్నం

6 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *