Middle Class Girl Story Telugu
నేను హేమలతను. పెద్ధ చదువులు చదవలేదు. అందరి అమ్మ నాన్నల్లాగే మా వాళ్లు నన్ను ఓ అయ్య చేతిలో పెట్టారు. బరువో బాధ్యతో దింపుకున్నారు. ఇద్దరు పిల్లలు. 8, 10 ఏళ్ల వయస్సు వాళ్లు. ఎవరితోనూ ఎక్కువ మాటాడే అలవాటు లేదు.
మా వీధిలో ఒక్క అక్కతోనే ఎప్పడన్నా మాటాడుతుంటాను. నేను నా పని, పిల్లలు ఇదీ నా లోకం. నా భర్త రోజూ కష్టపడడు. పాత ఆటోలు కొని పార్ట్స్ వేసి రీ సేల్ బిజినెస్ బేరం తగిలితే డబ్బులు. లేకపోతే లేదు. వేరే పనేం చేయడు. ఖాళీ ఉంటాడు. ఒక్కోసారి పస్తులుంటాం. పిల్లలు పస్తులు ఉంటే మనసు కాలిపోతుంది. అయినా తనకేం పట్టదు.
Middle Class Girl Story
ఈ మధ్య మా పక్కింటి ఎదురింటి అమ్మాయిలతో జల్ది ఫైవ్ ఆటతో కాలక్షేపం చేస్తున్నాడు. పూర్తిగా పని లేదు. ఇల్లు గడవడం లేదు. బాధగా ఉంది. అదే పక్కింటామెతో చెప్పుకున్నాను. ఆ విషయం తనకి తెలిసింది. గొడవ పెట్టుకున్నాడు. అందరితో ఇంటి విషయాలు చెబుతున్నానని. నేను ఎవరితోను మాటాడకూడదని హామీ తీసుకున్నాడు. అలా ఆ గొడవ సద్దుమనిగింది.
రోజూ రాత్రులు ఒంటి గంట దాటాక ఇంటికి వస్తాడు. ఒకరోజు బాగా బాధగా అనిపించింది. మౌనంగా పడుకున్నాను. పొద్దున లేవలేదు. టిఫిన్ తెచ్చి తినమన్నాడు. అలిగి లేవలేదు.
దాంతో వంటి గదిలోకి వెళ్లి సిలిండర్ తెచ్చి గట్టిగా దానిని హత్తుకుని చచ్చిపోతాన్నాడు. నేను భయపడిపోయా గభాల్న లేచి వద్దు వద్దని లాగడం మొదలెట్టాను.
నన్ను బలంగా నెట్టేసాడు. నేనెల్లి టీవీ మీద పడ్డాను. నా దెబ్బలు గురించి పట్టించుకోలేదు. మళ్లీ మళ్లీ వెళ్లి అతనిని సిలిండర్ నుంచి వేరు చేయాలని ప్రయత్నించాను. మళ్లీ నన్ను తన్నాడు. అడ్డుకుంటున్నానని కొట్టడం మొదలెట్టాడు.
Middle Class Girl Story
పిల్లలేమో పక్క వీధిలో ఉన్న వాళ్ళ మావయ్యని తీసుకురావడానికి పరిగెత్తారు. ఇంతలో ఇరుగు పొరుగు అంతా చేరి నన్ను పక్కింటిలోకి తీసుకెళ్లారు. అంతలోనే మా వీధిలో ఉండే లాయరమ్మ వచ్చింది. నన్ను చూసి ఓదార్చారు. గొడవేంటనీ అడిగితే మా పక్కింటామె విషయమంతా చెప్పింది. చుట్టుపక్కనవాళ్లంతా ఎందుకు గొడవ ఆడోళ్లమే సర్ధుకుపోవాలి అని చెప్పారు. తెస్తే వండి పెట్టాలి. లేకపోతే ఊరుకోవాలి.
అనుమానం మంచిది కాదు. అయ్యిందేదో అయ్యింది. పొద్దునే లేచి స్నానం చేసి రెడీ అయ్యి మగాళ్ళకు కనిపిస్తే ఈ గొడవుండదు కదా అంటూ హితవు పలికారు. అతనికి బీపీ వచ్చేసింది. రెచ్చగొడితే చూడు ఎలా ఊగిపోతున్నాడో అంటూ తలో మాట అన్నారు. ఆ మాటలన్నీ విన్న లాయరమ్మ.
Middle Class Girl Story
బీపీ అయితే డాక్టర్ దగ్గరకి వెళ్లాలి. మందులు వాడాలి. అంతేకానీ భార్యను కొట్టడమేంటనీ అన్నారు. అర్ధరాత్రులు వస్తే అనుమానించకూడదా..? కనీసం ఆ అమ్మాయి అలగడం కూడా తప్పేనా..? అంటూ ఆమె గట్టిగా మాటాడారు. చేతయితే వెళ్లి కొట్టిన ఆ మగాడికి చెప్పండి బుద్ధి అన్నారు. తప్పు చేసినవాన్ని వదిలేసి ఈ అమ్మాయినంటున్నారేంటి అంటూ నిలదీశారు.
అన్నిటికి ఏడుపు మౌనం నా జవాబయ్యింది. ఎందుకంటే చెప్పెవాళ్లందరికి తెలుసు. వాళ్ల భర్తలతో వాళ్లకుండే గొడవలు, సమస్యలు. సర్ధుకుపోతున్నారు. నేను కూడా. కానీ లోలోపల ఉన్న బాధ, అవమానం ఎప్పుడో ఒకనాడు బట్టబయలు కాక తప్పదుగా. అదే ఇవాళ జరిగింది. కొన్ని రోజులు అమ్మ వాళ్లింటికి వెళ్లాను.
Middle Class Girl Story
ఆడపిల్లల కాపురాల్లో సమస్యలొస్తే రెండు మూడు రోజులు ఆదరించే ఇల్లు పుట్టిల్లేగా. నాలుగో రోజు అమ్మ సర్ధుకుపోవాలి. పిల్లలున్నారు అంటూ నచ్చచెప్పి మెల్లగా ఇంటినుంచి సాగనంపుతారు. నా పరిస్థితి అంతే అయ్యింది.
కానీ రెండు నెలల తర్వాత నా భర్త మరో పెళ్లి చేసుకున్నాడని తెలిసింది. ఘోరమేంటంటే మా పక్కింటాయన ఆ పెళ్లికి వెళ్లాడట. ఇంత తెలిసాక పిల్లలని తీసుకుని అమ్మగారింటికి దారి పట్టాను. కానీ వారం తర్వాత తిరుగు టపాలా మా ఆయన దగ్గరకే చేరాను.
పెద్ద మనుషులు కూడారు. ఆడపిల్లవు పిల్లలతో ఎలా బతుకుతావు నిన్ను పిల్లల్ని లోటు లేకుండా చూస్తానంటున్నాడు కదా ఇంకేంటీ అని అన్నారు. దానికి మౌనంగా తలొంచాను. నాకు వేరే దారి చూపించలేదు. భర్తే దిక్కంటూ పంపారు. స్వతంత్ర నిర్ణయం తీసుకోలేని నిస్సహాయరాలిగా మిగిలిపోయాను.
Middle Class Girl Story
ఆడవాళ్లు ఎంతో అభివృద్ధి చెందేశారు.. వాళ్లే టాప్‌లో ఉన్నారనుకుంటున్న ఎంతోమందికి ఈ హేమలత జీవితం ఒక ఉదాహరణ. ఇదే కథను ఒక సీరియల్లోనో.. ఓ సినిమాలోనో చూస్తే.. ఆ హేమలత పాత్రపై సానుభూతి చూపిస్తాం. ఎదురుతిరగొచ్చు కదా పిచ్చిపిల్లా అనుకుంటాం. అదే మన ఇంటి పక్కనో.. మన ప్రాంతంలోనే జరిగితే.. ఆ ఆడపిల్లకు ఏం సలహా ఇస్తాం. సర్దుకుపోమనే బ్రహ్మాస్త్రాన్ని తీస్తాం.
కనీసం విడాకులు తీసుకో నీ బతుకు నువ్వు బతుకు అనే సలహాను కూడా ఇవ్వలేం. ఈ సొసైటీలో అమ్మాయిలకు భద్రత లేకపోవచ్చు.. బయట కీచకులుండొచ్చు.. నడిచే దారంతా ముల్లు ఉండొచ్చు.. కానీ వాటన్నింటికి ఒకే ఒక్క కాగడా అదే ధైర్యం..
Middle Class Girl Story
అది నూరుపోయోచ్చు కదా. పెళ్లి.. భర్త ఇవేనా జీవితం. సరే సర్దుపోమని చెప్పిన పెద్ద మనుషులు ఆ భర్త చేసిన తప్పు హేమలత చేస్తే.. ఆ భర్తకి సర్దుపోమని చెప్పగలరా.? చెప్పలేరు సరికదా.. ఇంకా ఘోరమైన శిక్ష వేస్తారు.
ఈ సమాజంలో అమ్మాయికో నీతి.. అబ్బాయికో నీతి..అంతే. అందుకే హేమలత జీవితంలో హేమలతను చూడ్డం కాదు.. మన పాత్రను చూసుకుందాం. హేమలత నిస్సహాయతకు ఈ సమాజం అంటే మన ఆలోచనలే కారణమని గుర్తిద్దాం.
Middle Class Girl Story
హేమలతకు జరిగే అన్యాయాలు నిత్యం ఏదో ఒక మూల జరుగుతూనే ఉన్నాయి. ఎందరో హేమలతలు సమాజం తయారు చేసిన మట్టి ముద్దల్లా అవమానాలకు ప్రతి రూపాల్లా మిగిలిపోతూనే ఉన్నారు.
ఇప్పటికీ ఆడపిల్లకు ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎంత అవసరమో ఇంకా గుర్తించని కుటుంబాలు, సమాజం ఉన్నాయంటే బాధాకరం. ప్రతి తల్లీ, తండ్రీ మారాలి. ఆడపిల్లల జీవితాలను మార్చాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే దివిటిల్లా తీర్చిదిద్దాలి.
ఆడపిల్లను అవమానాలతో కాదు.. ఆత్మ విశ్వాసంతో పెంచాలి. అనుమానంతో కాదు ఆత్మ గౌరవంతో నిలబెట్టాలి. దానికి మేం సిద్ధం మీరు సిద్ధమేనా..?
అన్నపూర్ణ…