Nushu language
ఒక్కో దేశానికి లేదా ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష ఉంటుందని అందరికీ తెలుసు.. కానీ మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ఒక భాష ఉందని తెలుసా..? ఆశ్చర్యంగా అనిపించినా ఇది ముమ్మాటికీ నిజం. అది ఎక్కడో.. ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుందా.? గొప్ప ఆవిష్కరణలు అవసరాల నుంచే పుట్టుకొస్తాయి. ఆ అవసరమే ఈ భాషకు కారణమైంది. అలా వచ్చిన మహిళల భాషకు పెద్ద చరిత్రే ఉంది. ఆ అవసరం ఏంటో.. దాని సృష్టికర్త ఎవరో తెలుసుకుందాం.
ప్రపంచంలో మహిళల కోసం సొంతంగా ఒక భాష ఉంది. అది ఒక రహస్య భాష. ఇది మహిళలకు ప్రత్యేకం. ఆ భాష చైనాలో పుట్టింది. అక్కి మహిళలు తమ బాధలు, ఫీలింగ్స్‌ను ఆ లాంగ్వేజ్‌లోనే షేర్ చేసుకునేవారు. ఆ భాషే నుషు.. ఒక టైంలో చైనాలోని మహిళలకు చదవడానికి, రాయడానికి హక్కు ఉండేది కాదు. దాంతో వారు మాట్లాడుకోవడానికి ఈ భాషను తయారు చేసుకున్నారు.
ఈ నుషు భాష చైనాకు ఆగ్నేయంలో ఉండే హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్ యాంగ్ గ్రామీణ ప్రాంతంలో పుట్టింది. ప్రపంచంలో మహిళలు లిపితో సహా తమ కోసమే సృష్టించుకున్న ఏకైక భాష అది. నుషుకు చైనా భాషలో ‘మహిళల రచన’ (women’s writing) అని అర్థం. 19వ శతాబ్దిలో బాగా పాపులర్ అయింది.
Nushu language
చైనాలో పూర్వ కాలంలో భూస్వామ్య వ్యవస్థ ఉండేది. భూస్వాముల చేతుల్లో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా ఉండేది కాదు. అలాగే తీవ్రమైన పేదరికంతో మహిళలు మరింత ఇబ్బందులు పడేవారు.
ఇంట్లో భర్తలు వేధిస్తుండేవారు. ఎవరితోనైనా నోరార చెప్పుకోవడానికి ఛాన్స్ లేదు.
దాంతో ఆ ప్రాంతంలో హన్, యావ్, మియావో వర్గాలకు చెందిన మహిళలు ఈ నుషు భాషను రూపొందించారు. ఎవరికి అర్థం కాకుండా ఈ రహస్య భాషలోనే మాట్లాడుకునే వారు.
సామాజికంగా తమకున్న ఇబ్బందులను, సమస్యలను ఒకరికొకరు చెప్పుకోడానికి స్థానిక మహిళలు నుషు భాషను వాడుకునే వారు. తర్వాత కాలంలో వివాహాలు, శుభకార్యాల సమయంలో ఈ భాషలో పాటలు పాడడం.
ఆ లిపితో రాసిన సందేశాలను పంపుకోవడం అక్కడి మహిళలకు అలవాటుగా మారింది. వృద్ధులైన మహిళలు జీవితంలో ఎలా నెగ్గుకు రావాలో, ఎలా ప్రవర్తించాలో, మంచి భార్యలుగా ఎలా ఉండాలో బోధించే అనేక కథలు, జీవితానుభవాలను ఈ భాషలోనే పాటలు కట్టి పాడుతుండేవారు. ఒక సమయంలో చైనా మహిళలకు నుషు భాష వారికి బాగా ఉపయోగపడింది. మహిళల మధ్య సామాజిక బంధం ఏర్పరుచుకోడానికి ఆ భాష ఒక సాధనమైంది.
Nushu language
సంగ్ వంశ పాలనా కాలమైన 960-1279 సంవత్సరాల కాలంలోనే ఈ భాష వాడుకలో ఉందని భాషా నిపుణులు అంటే, మరికొందరు 3,000 కిందటి షాంగ్ వంశ పాలనా కాలంలో కూడా నుషు భాషను మాట్లాడేవారని అంటున్నారు. మహిళలకు చదువుకునే స్వేచ్ఛలేని భూస్వామ్య పాలనలో ఈ భాష తల్లల నుంచి పిల్లలకు, పిల్లల నుంచి వారి పిల్లలకు వారసత్వంగా అందుతూ వచ్చింది. చదువు రాని మహిళలు నుషు భాషను నేర్చుకున్నారు.
అయితే ఈ భాష గురించి చాలా సంవత్సరాల పాటు ఈ భాష బయటి ప్రపంచానికి తెలియదు. 1980 తర్వాతనే చైనాకు అవతల దీనిని నేర్చుకోవడం మొదలైంది. ఒకప్పుడు పువేయీ గ్రామానికి చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల్లో ఈ నుషు భాషను మాట్లాడేవారు. 1980లో 200 మంది జనాభా ఉన్న పువేయీ గ్రామంలో నుషు భాషను రాయగలిగిన వ్యక్తులు ముగ్గురే ఉండేవారు. దీంతో ఈ భాషపై పరిశోధనలకు పువేయీ గ్రామం కేంద్రంగా మారింది.
నుషు భాషను అంతరించిపోతున్న చైనా వారసత్వ సంపదగా చైనా స్టేట్ కౌన్సిల్ 2006లో గుర్తించింది. ఒక మ్యూజియంను కూడా ఏర్పాటు చేసింది. నుషు భాషను రాయగల, చదవగల, మాట్లాడగల ఏడుగురిని ఇక్కడ ఉద్యోగులుగా నియమించారు. వారిలో జిన్ అనే మహిళ ఒకరు.
జియాంగ్‌యాంగ్ ప్రాంతంలో నాలుగు మాండలికాలలో ఈ భాషా వినియోగం ఉంది. సుషు భాష లిపి కుడి నుంచి ఎడమకు ఉంటుంది. చైనా అక్షరాల ప్రభావం దీనిపై కనిపిస్తుంది. అక్కడక్కడా సాగదీసినట్లుగా, వంగినట్లుగా కనిపించే ఈ లిపిని స్థానికులు దోమల రాత అని కూడా పిలుస్తుంటారు.
పరిశోధనా పత్రాలను కాల్చేశారు. Nushu language
నుషు భాష గురించి తెలిసిన ఒకే ఒక పరిశోధకుడు జౌ షుయి. 1950లో ఆయన నుషు మాట్లాడే గ్రామానికి చెందిన మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడే ఆ భాష గురించి తెలుసుకున్నాడు. 1954లో జియాంగ్‌యాంగ్ కల్చరల్ బ్యూరో కోసం ఈ భాషపై పరిశోధన చేయడం ప్రారంభించాడు. అయితే అప్పటి ప్రభుత్వం ఆయన్ని రైటిస్ట్‌గా ముద్ర వేసి తన పరిశోధనా పత్రాలను కాల్చేసినట్టు జౌ షుయి వెల్లడించాడు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత మళ్లీ పరిశోధనలు చేసి నుషును అనర్ఘళంగా మాట్లాడే ఏకైక మహిళ యాంగ్ హున్ ద్వారా ఆ భాషకు డిక్షనరీ తయారు చేశాడు. అంతే కాదు ఆ భాషపై ప్రతి వేసవిలో మ్యూజియంలో ఉచిత శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాడు.
మావో సారధ్యంలో చైనా విప్లవం విజయవంతం అయిన తర్వాత భూస్వామ్య వ్యవస్థను కూల్చిన అప్పటి ప్రభుత్వం మహిళలకు సాధారణ విద్యను అందుబాటులో తీసుకొచ్చింది. దాంతో నుషు భాష తెరమరుగైంది. అయితే ఇటీవలి కాలంలో సినిమాలు, సాహిత్యంలో నుషుకు ప్రాతినిధ్యం పెరిగింది. జియాంగ్‌యాంగ్‌లోని యువతులు మ్యూజియంలో ఆ భాష లిపిని నేర్చుకుంటున్నారు. జిన్ వంటి ఆ భాషా వారసులు ప్రముఖ చైనీస్ యాప్ వి చాట్ ద్వారా ఆన్‌లైన్ తరగతుల్లో కూడా బోధిస్తున్నారు.
యాంగ్ హుయాన్ యీ . Nushu language
యాంగ్ హుయాన్ యీ.. హునాన్ ప్రావిన్స్‌లోని జియాంగ్ యాంగ్ కౌంటీలో నివసించే ‘నుషు’ భాషా వేత్త. ఆమె ‘నుషు’ కోసం ఎంతో కృషి చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఆ భాషకు ఆద్యురాలు. నుషును గుర్తించడం.. చదవడం. పాడడం.. రాయగల చివరి వ్యక్తి ఆమె అని చెప్పుకోవాలి. ఆమె 20 సెప్టెంబర్ 2004న 96ఏళ్ల వయస్సులో మరణించారు.
యాంగ్ చిన్నతనంలో గావో యిన్ క్షియన్‌తో కలిసి నుషు నేర్చుకుంది. గావో ఆ భాషలో మంచి వక్త, రచయిత. నాన్నమ్మ వైద్యురాలు కావడంతో యాంగ్ వైద్యం నేర్చుకుంది. నుషు భాషను నేర్చుకోవడంలో యాంగ్‌ను ప్రోత్సహించేవాడు. పొలం పనులు చేసి వచ్చిన డబ్బులతో భాష నేర్చుకోవడానికి వినియోగించేది. నుషును సజీవంగా నిలిపి ఉంచడానికి యాంగ్ కృషి మరవలేనిది.
–సూర్యం–