Menu

దేశ స్వతంత్ర చరిత్రలో ప్రీతిలత ఎక్కడ..?

Preethi Latha

త్యాగం చాలా గొప్పది.. మనం పుట్టిన గడ్డ కోసం చేసే త్యాగం ఇంకా గొప్పది. అలా  బ్రిటిష్ పాలన నుంచి భారత దేశాన్ని విముక్తి చేయడానికి ఎంతోమంది ప్రాణాలు అర్పించారు. కొందరు ఉరితాళ్లకు వేలాడారు. మరికొందరు తూటాలకు నేలకొరిగారు. అయితే అందులో చాలాకొద్ది మంది మాత్రమే మనకు తెలుసు. ప్రస్తుతం ఈ దేశం కొంతమందినే  స్వాతంత్రోద్యమ సాధకులుగా కీర్తిస్తుంది.

అందులోనూ దేశం కోసం అతి సునాయాసంగా ప్రాణాలు వదిలేసిన మహిళల గురించి అస్సలు తెలియదు. అలాంటి చరిత్ర మిగిలే ఉంది.  భగత్‌సింగ్, సూర్యసేన్, అష్ఫుల్లాఖాన్, ప్రీతిలత . . . వీళ్లంతా మన దేశ చరిత్రను చెక్కిన శిల్పులు.

Preethi Latha

దేశ స్వతంత్రం కోసం ఎందరో ఎన్నెన్నో రూపాల్లో తమ ప్రాణాలర్పించారు. ఆనాడు ఎంతోమంది యువతీ యువకులు స్వతంత్ర సాధనే తమ జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు.

దానికి కొంతమంది విప్లవ బాట కూడా పట్టారు. బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టాలనే ధృఢ సంకల్పంతో కుటుంబాలను, సర్వసుఖాలను వదిలేసుకున్నారు. ప్రాణాలివ్వడమే ఒక ఆదర్శంగా జీవించారు. ఆచరించారు. అలాంటి వాళ్లలో  ప్రీతిలత ఒకరు.

Preethi Latha

దేశం కోసం ప్రాణాలర్పించిన మొట్ట మొదటి విప్లవ కారిణి ప్రీతిలత వద్దేదార్. సరిగ్గా 1932, సెప్టెంబర్ 23న ప్రతీలత మరణం ఆమె చివరి మజిలీ అయ్యింది. బ్రిటీష్ వాళ్లు  ఈ దేశాన్ని దోచుకుపోవడాన్ని ప్రీతిలత సహించలేకపోయింది.

Preethi Latha 

భారతీయులను బానిసలగా చూడటాన్ని భరించలేకపోయింది.  దేశ స్వతంత్రం, స్వేచ్ఛ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. దానికి విప్లవబాటే శరణ్యమని నమ్మింది.

ఆమె ఎంచుకున్న మార్గం కఠినమైందని తెలిసినా.. ఆ మార్గంలోనే నడిచింది. తన ఆదర్శాలను వ్యక్తిగత జీవితంలో కూడా ఆచరించింది. 21 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది.

Preethi Latha

ప్రీతిలత వద్దేదార్ మే 5,1911లో చిట్ఠగాంగ్ జిల్లాలో దాల్ ఘాట్ గ్రామంలో పుట్టింది.  తల్లి ప్రతిభాదేవి. తండ్రి జగబంధు వద్దేదార్ ఆరుగురు పిల్లల్లో రెండో బిడ్డ ప్రీతి. పేద ఇంట్లో పుట్టినా ఉన్నత చదువు వల్ల ప్రీతిలో విశాల వ్యక్తిత్వం ఏర్పడింది.

బాల్యం నుంచి ఎక్కువగా పుస్తకాలు చదివేది.  లైబ్రరీలోనే ఎక్కువ గడిపేది. నిరంతర అధ్యయనం,  కల్పనాదత్  (ఇండియన్ రివల్యూషనరీ ఆర్మీలో ఉద్యమ సహచరి) వంటి స్నేహితులతో చర్చలతో జ్ణానాన్ని మరింత పెంచుకుంది.

Preethi Latha

మహిళలకు బయటకు రావాలంటే వంద ఆంక్షలు అలాంటి సమయంలో తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ప్రీతిలత ముందుకు వెళ్లడానికి సహాయ పడింది. మహిళలు బయటకి రావడం, చదువుకోవడం గగనమైన ఆ కాలంలో  ప్రీతి తండ్రి  ఆమెకు స్వేచ్ఛనిచ్చారు.

మహిళలు చీకటి పడితే బయటకు వెళ్లకూడదనే కాలంలో ప్రీతి తండ్రి తనే దగ్గరుండి తన కూతురు స్నేహితులతో ఇష్టమైనంత సేపు మాట్లాడుకోవడానికి తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. ఆ తండ్రి ప్రీతి వ్యక్తిత్వాన్ని ఎంతో గౌరవించారు.

దానివల్లే ప్రీతి ఆనాడు సమాజంలో మహిళలకున్న అనేక అడ్డంకులను దాటుకుని ముందుకువెళ్లింది.  తనకు దక్కిన ప్రతీ చిన్న అవకాశాన్ని మానసిక శారీరక ధృఢత్వాన్ని పెంచుకోవడానకి ఉపయోగించుకుంది.

Preethi Latha

ప్రీతిలతకు ఉపాధ్యాయురాలిగా ఉద్యోగం వచ్చింది. కుటుంబానికి ఆసరాగా ఉండాలనుకుంది. కానీ చిన్నప్పటి నుంచి పెరిగిన దేశభక్తి.  చుట్టూ ఉన్న విప్లవ వాతావరణం దేశ విముక్తి కోసం తరిమాయి.

ఈ భావాలతో బ్రిటీష్ పాలనలో దేశ గౌరవానికి భంగంగా ఉన్న ప్రతీ చర్యను తీవ్రంగా ఖండించేది. స్కూల్లో, కాలేజీలో ఒంటరిగానైనా నిరసన తెలియజేసేది. చదువుకునే చోట దీపాలీ సంఘ్ వంటి  విప్లవ సంఘంలో చేరి పనిచేసేది. మగవాళ్లతో సమానంగా  కర్రసాము నేర్చుకుంది. రోజూ ఎక్సర్‌సైజ్ చేసేది.

Preethi Latha

తర్వాత కాలంలో  బ్రిటీష్ ఆయుధగారం మీద దాడి చేసిన సూర్యసేన్ స్థాపించిన ఇండియన్ రివల్యూషనరీ ఆర్మీలో చేరాలని నిర్ణయించుకుంది.  ఐఆర్ఏ రహస్య విప్లవ కార్యకలాపాలు గురించి వింటూ లోలోపల ఆ భావాలను విస్త్రతపరచుకున్న ప్రీతి  అందులో మహిళలకు ప్రవేశం లేదని తెలిసి ఎంతో నిరాశకు గురైంది.

కానీ అనతి కాలంలోనే మహిళల భాగస్వామ్యం గుర్తించిన సంస్థ ప్రీతిని ఆహ్వానించింది. తన చిన్న కుటుంబాన్ని వదిలి. దేశమనే పెద్ద కుటుంబ బాధ్యతను  నెత్తికెత్తుకుంది.

కొరియర్‌గా పేలుడు పదార్థాల సరఫరా వంటి అనేక బాధ్యతలను నిర్వహించింది. అనేక దాడుల్లో పాల్గొంది. బాంబు తయారీ తెలిసిన ఉరిశిక్ష పడి జైల్లో ఉన్న తోటి కామ్రేడ్ రామక్రిష్ణ బిస్వాస్‌ను కలిసేది. బాంబు ఎలా తయారు చేయాలో, దాచిన ప్రదేశాలు, షెల్టర్లు వంటి సమాచారాన్ని తెలుసుకుని సంస్థకు అందించేది.

Preethi Latha

ఎంచుకున్న విప్లవ బాటలో ఎంతోమంది తన కళ్ల ఎదుటే చనిపోయిన ప్రతీ లత ఏ మాత్రం చలించలేదు. శత్రుదాడిలో నాయకులు, సహచరుల మరణాన్ని కళ్లకి, మనస్సుకి మాత్రమే పరిమితం చేసేది. రేపటి బాధ్యత  ఆమెని అక్కడి నుంచి నడిపించేది.

ప్రీతిలోని ఈ దృఢ సంకల్పం మహిళలు విప్లవ సంఘాల్లో పనిచేయడం కష్టమని భావించిన నాయకుల అభిప్రాయాన్ని మార్చివేసింది. చదువుకుంటూ, ఉద్యోగం చేస్తూ రహస్య కార్యకలాపాలెన్నిటినో చాకచక్యంగా నిర్వహించింది.

Preethi Latha

Freedom fighters

తన విప్లవ  ప్రయాణంలో భాగంగా ప్రీతిలత  ఓ దాడికి నాయకత్వం వహించి.. చివరికి ప్రాణాలు వదిలేసింది. సంఘం ఆధ్వర్యంలో కుక్కలకి, భారతీయులకి ప్రవేశం లేదని  రాసిన తెల్ల దొరలు కాలక్షేపం చేసే  ఓ యూరోపియన్ క్లబ్  మీద దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నారు. ఈ దాడికి  ప్రీతి లత నాయకత్వం వహించింది.

పంజాబీ పురుషుడి వేషంలో  తన టీమ్‌ను నడిపించింది. దాడిలో అత్యంత సాహసాన్ని ప్రదర్శించింది.  తన తోటి కార్యకర్తలని శత్రు దాడి నుంచి కాపాడ్డానికి ఎంతో కృషి చేసింది.

ఆ క్రమంలో ప్రీతి ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లినా.. దారంతా రక్తం ఓడుతున్నా సహచరులకు చెప్పలేదు. బ్రిటీష్ వారికి ప్రాణాలతో చిక్కకూడదని తన దగ్గర ఉన్న  సైనేడ్‌తో పాటు తోటి సహచరుడి దగ్గర సైనేడ్ కూడా తీసుకుంది.  తన బృందాన్ని శత్రువుకి దొరక్కుండా పంపించేసింది.

పార్టీ ఇచ్చిన గురుతుర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి తను మాత్రం అక్కడే కుప్పకూలిపోయింది. 21 ఏళ్లకే ఈ దేశం కోసం తన జీవితాన్ని అలా అంకితం చేసింది.

Preethi Latha

ప్రీతిలత కేవలం దేశం కోసం బ్రిటిష్ వాళ్లతోనే కాదు మహిళలపై ఉండే వివక్షతతో, మహిళలను కట్టడి చేసే కట్టుబాట్లతోనూ పోరాటం చేసింది. దేశం కోసం ఆ ఆంక్షలను, ఆ చిన్నచూపుతోనూ ఫైట్ చేసింది. ఇలాంటి ప్రీతిలత గురించి స్మరించుకోవడం భారతీయులుగా మన బాధ్యత.

చిట్టగాంగ్ తిరుగుబాటు నేపథ్యంలో అభిషేక్ బచ్చన్, దీపిక పదుకునే ప్రధాన పాత్రధారులుగా నిర్మించిన సినిమా ఖలీన్ హమ్ జీ జాన్ సే సినిమాలో ప్రీతిలత పాత్ర ఉంది. ఆ సినిమాలో ఈ పాత్రను విశాఖ సింగ్‌ పోషించింది. అయితే ప్రీతిలత బయోపిక్‌ను తీయాలనే ఆకాంక్ష చాలామందిలో ఉంది.

                                                                                                                                                                                                                                                          …అన్నపూర్ణ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *