Seshaiah
బతకడం అంటే ఎలాగైనా బతకొచ్చు… కానీ ఇలాగే బతకాలి, విలువల కోసం బతకాలని కొందరే అనుకుంటారు. తోటి వారి కష్టాలకు, బాధలకు తమ గొంతులను అందించే వాళ్లు అరుదుగానే ఉంటారు. అలాంటి ఆశయంతో చివరి వరకూ ప్రయాణించే వాళ్లు ఇంకా తక్కువగా ఉంటారు. అలా జీవించిన వ్యక్తే ప్రొఫెసర్ శ్రేషయ్యగారు.
ఈ దేశంలో మేధావులెందరో ఉన్నారు. కానీ తన మేధస్సున్నంతా పీడిత ప్రజల కోసం వెచ్చించిన వాళ్లు అతి కొద్దిమంది మాత్రమే. అలాంటి ఉదాత్తమైన వ్యక్తుల్లో ప్రొఫెసర్ శేషయ్య ఒకరు. శేషయ్య సుదీర్ఘకాలం పౌరహక్కుల సంఘంలో పనిచేశారు.
Seshaiah
ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అంటే తెలియని వారుండరు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం అంటే పీడిత వర్గానికి గొంతుగా పనిచేసిన సంఘం.
ఎన్‌కౌంటర్ అంటే, లాకప్ డెత్ అంటే భయపడే చీకటి రోజుల్లో పౌరహక్కులనే ఆయుధంగా ఎక్కుపెట్టి రాజ్యాన్ని ప్రశ్నించిన సంఘం.
ఆ సంఘంలో పని చేయడమంటే పౌరుల హక్కుల కోసం ప్రభుత్వాన్ని, పోలీసులను ఎదురించడమే.. ప్రాణాలను పణంగా పెట్టాల్సిందే.. అలాంటి చరిత్ర కూడా ఆ సంఘానికి ఉంది. అందులో పని చేస్తూ ఎంతోమంది అమరులయ్యారు. ఆ సంఘంలో సుదీర్ఘ కాలం పనిచేయడమంటే సాహసం.
Seshaiah
పౌరుల హక్కుల సంఘంలో పని చేస్తునందుకు… ప్రొఫెసర్ శేషయ్యం మిత్రులను ఎందరినో ఈ రాజ్యం కర్కశంగా పొట్టన పెట్టుకుంది. ఆ బాధాకరమైన, దు:ఖభరితమైన గుండెబరువును మోస్తూనే చెక్కు చెదరని దృఢ నిశ్చయంతో సంఘం లక్ష్యాల కోసం శేషయ్య పనిచేశారు. అంతేకాదు రాజ్య హింసతోపాటు విప్లవ హింసను ఖండించాలని సంఘంలో వచ్చిన ప్రతిపాదనను నిరద్వంద్వంగా ఖండించారు.
అత్యంత బలమైన రాజ్యం పౌరుల మీద చేస్తున్న హింసను ఖండించడానికి మాత్రమే పౌరహక్కుల సంఘం ఉండాలని సంఘంలో ఏకాభిప్రాయాన్ని సాధించిన మేధావి.
Seshaiah
శేషయ్య రాజ్యం దాడిని ఎదుర్కొంటూనే తను కాలేజికీ పోయేటప్పుడు వచ్చేపుడు ప్రభుత్వ గూండాలు వెంటబడినా, ఇంటి మీద దాడి చేసి ఇంటినీ, కారునీ తగలబెట్టినా, నిత్యం కోబ్రాలు, టైగర్ల పేరుతో బెదిరింపులకు గురైనా తన సంస్థ కార్యకర్తలకు మానసిక ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించారు.
అంతేకాదు తన అధ్యయనానికి కానీ ఆచరణకు కానీ దూరమవ్వలేదు. అనారొగ్య కారణంగా ఆయన చేయలేకపోయిన వాటి కోసం ఎంతో ఆవేదనకు గురయ్యేవారు.
చదువుకునే కాలంలోనే విప్లవ విద్యార్థి సంఘంలో భాగమయ్యారు. పీడిత వర్గ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. ఆనాటి నుండి తుది శ్వాస విడిచే వరకు విప్లవ రాజకీయాలతో ఉన్నారు.
తోటి మేధావులు అంతా కెరీయర్, సంపాదన మీద దృష్టి పెడితే శేషయ్య మాత్రం తన ఫోకస్ అంతా తన చుట్టూ ఉన్న అసమ సమాజం మీద దృష్టి పెట్టారు.
ఈ దేశంలో పాతుకు పోయిన వ్యవస్థీకృత హింసల వల్ల అత్యధిక శాతం పేద ప్రజలు తీవ్రమైన అసమానతలను ఎదుర్కొంటున్నారని, ఈ అసమానతలను రాజ్యం పెంపుడు జంతువుల్లా పెంచి పోషించడం మూలంగా ఈ దేశ పౌరులు రాజ్యాంగమిచ్చిన ఏ హక్కునీ అనుభవించలేకపోతున్నారనీ ప్రచారం చేశారు.
Seshaiah
దేశంలో పౌరహక్కులు మనుగడ సాధించాలంటే విప్లవ రాజకీయాలతోనే సాధ్యమని భావించి ఆచరించారు. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ తన అభిప్రాయాలను, ఆలోచనలను రచనల ద్వారా ప్రసంగాల ద్వారా విస్తృత ప్రచారం చేశారు.
ఈ దేశంలో సాయుధ పోరాటం ఉద్భవించినప్పటి నుండి దానిని నిర్మూలించాలని ఈ దేశ పాలకవర్గాల కల. ఆ కలను నిజం చేయడానికి ఎంచుకున్న మార్గం బూటకపు ఎన్ కౌంటర్లు. ఇప్పటివరకు ఈ ఎన్ కౌంటర్ల పేరుతో ఈ దేశ ఫాసిస్టు పాలకులు ఎంతమంది పౌరులను పొట్టన పెట్టుకున్నారో లెక్కలేదు.
ఇది శాంతిభద్రతల సమస్య కాదు. సామాజిక, రాజకీయ, ఆర్ధిక సమస్య అని సుదీర్ఘకాలంగా హక్కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు మొత్తుకుంటూనే ఉన్నారు. అయినా రాజ్యం తన ఎన్ కౌంటర్ల పరంపరను కొనసాగిస్తూనే ఉంది.
సరిహద్దుల్లో పహారా కాయాల్సిన మిలటరీని దించి విప్లవోద్యమం మీద యుద్ధం చేయిస్తున్నారీ పాలకులు. దేశంలో అంతర్గతంగా జరిగే సాయుధ ఘర్షణలో మానవ హక్కులు పరిరక్షించబడాలనీ, రాజ్యం అందుకు అంతర్జాతీయంగా వున్న మానహక్కుల చట్టాలను గౌరవించాలని శేషయ్య ఎంతో పరితపించారు.
Seshaiah
ఈ రాజ్యం దోచుకోవడానికొచ్చిన వారికి స్వేచ్ఛనిస్తుందనీ ఆదివాసులు, మత్యకారులు, రైతులు, కార్మికులు ఇలా అట్టడుగు వర్గానికున్న సహజహక్కులన్నిటినీ నిషేధిస్తుందనీ అందులో భాగంగానే ప్రజలతో యుద్ధం చేస్తుంది.
అందుకు ప్రత్యామ్నాయంగా ఆ ప్రజలు తమ హక్కులు కాపాడుకోవడానికి సాయుధ పోరాటాన్ని కొనసాగించడం న్యాయమేనని సమర్ధించిన మేధావి ప్రొ.శేషయ్య.
ఈ దేశంలో ప్రపంచీకరణ అడుగుపెట్టినప్పటి నుండి హక్కుల మధ్య ఘర్షణ, హక్కుల మధ్య పోటీ కొనసాగుతుందన్నారు. అభివృద్ధి అనే కుంపటిలో పీడిత వర్గానికున్న హక్కులన్నీ ధ్వంపంమైపోతున్నాయనీ వాటి పరిరక్షణ కోసం జాతీయహక్కుల సంఘాల ఐక్యత అవసరాన్ని గుర్తించారు.
Seshaiah
ఆ ఐక్యత కోసం దేశ వ్యాప్తంగా తిరిగారు. ముఖ్యంగా రాజ్య హింస మీద ఏకాభిప్రాయ సాధనకు కృషి చేసారు. వివిధ హక్కుల సంఘాలతో కో ఆర్డినేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ ఆర్గనైజేషన్ (CDRO) జాతీయ ఉమ్మడి హక్కుల సంస్థ ఏర్పాటులో భాగమయ్యారు.
సంస్థ పత్రిక ‘‘స్వేచ్ఛ’’ ను ఒక ఆర్గనైజర్ గా సామాజిక రాజకీయ ఆర్థిక పరిణామాల పట్ల ఎప్పటికప్పుడు ప్రజలను, కార్యకర్తలను ఎడ్యుకేట్ చేసే విధంగా తీర్చిదిద్దాలని, సకాలంలో అందించాలని ఎంతో తపన పడ్డారు. ఆ పత్రిక తీసుకురావడంలో ఎన్నోసమస్యలు. ఆ ఒడిదుడుకులకు ఎదురీదుకుంటూనే పత్రిక తీసుకురావడానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు.
ప్రగతిశీల ప్రజా ఉద్యమాలలో పాల్గొనే నాయకులు, కార్యకర్తలు అధ్యయనాన్ని ఒక ఆయుధంగా ఎంచుకోవాలనే వారు. మార్క్సిజాన్ని, సాహిత్యాన్ని నిరంతరం అధ్యయనం చేయడం వలన నిర్ధిష్టమైన వ్యక్తిత్వ రూప కల్పనకు, సమాజమార్పుకు దోహదపడుతుందని గాఢంగా నమ్మిన వ్యక్తి.
Seshaiah
ఆ వ్యక్తిత్వంతోనే తోటి మిత్రులతో కార్యకర్తలతో మెలిగేవారు. సున్నితమైన స్నేహ హస్తాన్నందించేవారు. సంస్థలోకి వచ్చిన కొత్తకార్యకర్తలతో తనకంటే ఎంత చిన్నవాళ్ళయినా, మహిళలయినా వాళ్ళ స్థాయికి దిగి సంభాషించేవారు. మహిళా కార్యకర్తల పట్ల ఎంతో శ్రద్ధను చూపేవారు.
వాళ్లు చురుగ్గా మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన జ్ఞానాన్ని, సలహాలను అందించేవారు. రాసేవాళ్ళంటే ఒక ప్రత్యేకమైన ఆశక్తి ఉండేది. వాళ్లని బాగా ప్రోత్సహించేవారు. ఇంకా క్వాలిటీగా రాయడానికి సూచనలిచ్చేవారు. తను ఏదైనా రాసేటప్పుడు అవసరమైన విషయం కోసం ఆయా రంగాల కార్యకర్తలను సంప్రదించి సలహాలడిగేవారు.
Seshaiah
మనిషి మనుగడ సాగించడానికి అవసరమైన స్వేచ్ఛలన్నీ ఆంక్షలకు గురవుతున్న సంక్షోభ కాలంలో పీడిత ప్రజల గొంతు ప్రొఫెసర్ శేషయ్య లేకపోవడం పౌరసమాజానికి పూరించలేని లోటు అనే చెప్పాలి.
తన జీవితమంతా మానవీయ విలువలతో విప్లవ కార్యాచరణతో జీవించిన పీడిత ప్రజలకు అత్యంత గౌరవాన్ని, ప్రేమను పంచి సమాజానికి ఎంతో స్ఫూర్తిగా నిచ్చిన మా ఆప్తమిత్రుడు ప్రొ. శేషయ్య లాంటి వ్యక్తులు మరెంతో మందికి ఆదర్శం.
— అన్నపూర్ణ —