Sunday Holiday Reason in Telugu
ఏ ఉద్యోగులమైనా సరే మనమందరం ఆదివారం కోసం ఎదురు చూస్తాం.. నిజంగా మనకు అదో పండగే.. ఎందుకంటే బతుకుదెరువుకు ప్రతి రోజు పనికి పోవాల్సిందే. దీంతో వ్యక్తిగత పనులు ఎన్నో పెండింగ్‌లో పడిపోతాయి.
కనీసం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే ఆదివారం కోసం ఎంతో ఎదురు చూస్తుంటాం. వ్యక్తుల జీవితంలో అంతటి ప్రాధాన్యం గల ఆదివారం సెలవు ఎలా వచ్చిందో తెలుసా..? ఆదివారం సెలవు కోసం ఏడేళ్ల పోరాటం జరిగిందని తెలుసా..? ఈ పోరాటాన్ని ముందుడి నడిపించింది లోఖండే అని ఎంతమందికి తెలుసు..?
Sunday Holiday Reason | లోఖండే ఎవరు..?
కార్మిక ఉద్యమాలకు ఊపిరి పోసిన నేత నారాయణ్ మేఘాజీ లోఖండే. మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ స్థాపించింది లోఖండే. జ్యోతిరావు ఫూలే అంటే అందరికీ తెలుసు కాని ఆయనతో బహుజనుల కోసం పాటుపడి బ్రిటిష్ వాళ్లతో రాజీలేని పోరాటం చేసిన లోఖండే గురించి ఎవరికి తెలియదు.
కార్మికుల పోరాటాలంటే మనకు గుర్తొచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ. కానీ ఆ పార్టీ ఆవిర్భవించకముందే.. లోఖండే కార్మికుల జీవితాలు, జీతాల కోసం అలుపెరుగని పోరాటాలు చేశాడు.
నారాయణ్ మేఘాజీ లోఖండే మహారాష్ట్రలోని థానేలో 1848లో జన్మించారు. తోటమాలి వృత్తిచేసే మాలి కులంలో పుట్టిన లోఖండే చిన్ననాటి నుంచే పేదల కష్టాలను చూసి చలించిపోయేవాడు. హై స్కూల్ వద్దే ఆయన విద్య ఆగిపోయింది. రైల్వేలోను, పోస్టల్ విభాగంతో తన వృత్తిని ప్రారంభించాడు.
1870లో మాండవి టెక్స్‌టైల్ మిల్స్‌లో స్టోర్ కీపర్‌గా చేరాడు. అక్కడ కార్మికుల కష్టాలను చూశాడు. ఫ్యాక్టరీ దోపిడీ స్వభావాన్ని తెలుసుకున్నాడు. ఆ అనుభవాలే, కార్మికుల దయనీయమైన జీవన పరిస్థితులే అతడిని పోరాటం వైపు నడిపించాయి.
దోపిడీని అరికట్టాలి.. కార్మికుల హక్కులు సాధించాలని బ్రిటిష్ యాజమాన్యంపై యుద్ధం ప్రకటించేలా చేశాయి. ఆ స్ఫూర్తితో జ్యోతిరావు ఫూలే ప్రారంభించిన సత్యశోధక్ ఉద్యమంలో 1874 నుంచి ఆయనతో పాటు పనిచేశాడు. 1880 తర్వాత ముంబయ్ నుంచి పబ్లిష్ అయ్యే ‘దీనబంధు’ అనే కార్మిక పత్రిక బాధ్యతలను తీసుకున్నాడు.
Sunday Holiday Reason | కార్మికుల పరిస్థితులు..
1881లో ఫ్యాక్టరీ చట్టం వచ్చినా అది సరిగా అమలు జరగకపోవడంతో కర్మాగారాల్లో కార్మికులకు రక్షణ లేకుండా అయిపోయింది. కార్మికులు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేసేవారు. యంత్రాల మధ్య యంత్రాలై రక్తాన్ని చెమటగా చిందించేవారు. చాలా వరకు కార్మికులు పనిలో ఉన్నప్పుడే భోజనం చేయవలసిన పరిస్థితి. యంత్రాలతో పాటు విరామం లేకుండా పనిచేయవలసి ఉండేది. ఒకవేళ కొన్ని పరిశ్రమల్లో భోజన విరామం ఉన్నా 15 నుంచి 20 నిమిషాలు సమయం మాత్రమే ఇచ్చేవి. అంతేకాదు పరిశ్రమల్లో గాలి, వెలుతురు ఉండేది కాదు. బాత్‌రూమ్ ఫెసిలిటీ అనేది ఎక్కడ లేనే లేదు. నిత్యం నడిచే యంత్రాల వల్ల విపరీతమైన వేడిలో కార్మికులు ఉక్కిరిబిక్కిరయ్యేవారు. కొన్ని పండుగలకు తప్ప, పరిశ్రమలు ఏడాది పొడవునా పనిచేసేవి. పరిశ్రమల్లో ఎక్కువ శాతం శ్రమ దోపిడీకి గురయ్యేది మహిళలు, బాలికలు. 1881 జనాభా లెక్కల ప్రకారం బొంబాయి టెక్స్‌టైల్ మిల్లుల్లో 23 శాతం మంది మహిళలు, బాల కార్మికులు (15 ఏళ్లలోపు) ఉండేవారు. రోజుకు 14 గంటలపైగా పనిచేయాల్సి ఉండేది. కనీసం విరామం, సెలవు లేకుండా వారమంతా నిత్యం పని చేయాల్సి ఉండేది. బ్రిటిష్ అధికారులు ప్రార్థన కోసం ఆదివారం చర్చికి
వెళ్లేవారు. కార్మికులకు మాత్రం అలాంటి అవకాశంలేదు.
Sunday Holiday Reason | మొదటి ఫ్యాక్టరీ చట్టం
కర్మాగారాల్లో దోపిడీ స్వభావానికి వ్యతిరేకంగా సాగిన పోరాటాల ఫలితంగా దేశంలో ఫ్యాక్టరీ పనుల పరిస్థితులపై ఆరా తీయడానికి 1875లో ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ కొన్ని నియమ, నిబంధనలను ప్రతిపాదించింది. లార్డ్ రిప్పన్ కాలంలో మొదటి ఫ్యాక్టరీ చట్టాన్ని 1881లో ఆమోదించారు. సంవత్సరానికి నాలుగు నెలలకు పైగా పనిచేసే అలాగే 100 మందికి పైగా కార్మికులు పనిచేసే కర్మాగారాలకు మాత్రమే ఈ చట్టం వర్తించేది. దానిలో భాగంగా ఏడేళ్ల కంటే తక్కువ వయస్సు పిల్లలను తీసుకోవడం నిషేధించింది. 7 నుంచి 12 సంవత్సరాల మధ్య పిల్లలకు 9 గంటల పని పరిమితిని పెట్టింది. అలాగే బాల కార్మికులకు ఒక గంట విరామం ఇవ్వాలి, వారానికి ఒక సెలవు ఇవ్వాలి.
అమలు కాని నిబంధనలు
చట్టం అయితే వచ్చింది కానీ అందులోని నిబంధనలేవి సరిగా అమలు కాలేదు. దీంతో కార్మికులు పోరాట బాట పట్టారు. దీంతో అప్పటి అధికారులు 1884లో ఫ్యాక్టరీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే లోఖండే అతని మద్దతుదారులు కార్మికుల కష్టాలను ప్రభుత్వం ముందు ఉంచే మంచి అవకాశంగా దాన్ని భావించారు. వేలాది మంది మిల్లు ఆపరేటర్ల సంతకాలను సేకరించి కమిషన్ ముందుంచారు. బొంబాయిలోని టెక్స్‌టైల్ మిల్లుల్లో ఉన్న దోపిడీ పని పరిస్థితులను ఎత్తిచూపారు. అదే సమయంలో కార్మికుల సంక్షేమం కోసం కొన్ని డిమాండ్లను కమిషన్‌కు తెలియజేశారు. అందులో ప్రమాద పరిహారం, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్ ఉన్నాయి.
మొదటి ట్రేడ్ యూనియన్
మార్క్స్ సిద్ధాంతాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా కార్మికోద్యమాలు పెరుగుతున్న రోజులవి. అలా మార్క్స్ సిద్దాంతాలకు లోఖండే కూడా ప్రభావితుడయ్యాడు. శ్రమదోపిడీనీ అంతం చేయాలనే లక్ష్యంతో నారాయణ్ మేఘాజీ లోఖండే 1884లో ముంబైలో బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అదే మన దేశంలో మొట్టమొదటి కార్మిక సంస్ఠ. ఈ సంస్థ ద్వారా లోఖండే అనేక పోరాటాలు చేశాడు. మాండవి టెక్స్‌టైల్ మిల్స్‌లో చేసే క్లర్క్ ఉద్యోగాన్ని కూడా వదిలిపెట్టి పూర్తిస్థాయిలో సంస్థకు అంకితమయ్యాడు.
ఏడేళ్ల పోరాటం
“మేము మా కుటుంబాల కోసం రోజుకు ఆరు రోజులు పని చేస్తాం’’ అని లోఖండే 1884లో పోరాటం మొదలుపెట్టాడు. ఈ పోరాటంలో భాగంగా కార్మికులకు వారాంతంలో కార్మికులకు సెలవు కావాలని బ్రిటిష్ వారికి లోఖండే ప్రతిపాదించాడు. అదేవిధంగా కార్మికులకు మధ్యాహ్నం అరగంట భోజన విరామ సమయం ఉండాలని, మిల్లు ఉదయం 6:30 నుంచి పని ప్రారంభించి సాయంత్రం వరకు మాత్రమే పనిచేయాలని, ప్రతి నెల 15 వ తేదీలోగా జీతాలివ్వాలనే డిమాండ్లు కూడా పెట్టాడు. కార్మికులకు ఆదివారం సెలవు కోసం నారాయణ్ మేఘాజీ లోఖండే ఏడేళ్లు పోరాడాడు. 1890లో ప్రతి వారం రెండు రోజులు మిల్లులను మూసివేయాలని యజమానులు ఏకపక్షంగా నిర్ణయించారు. దీనికి
బట్టలకు డిమాండ్ తగ్గిపోయిందనే కారణంగా చూపారు. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అసోషియేషన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనలో భాగంగా లోఖండే 1890 ఏప్రిల్ 24 న మహాలక్ష్మిలోని రేస్ కోర్సు మైదానంలో సభ నిర్వహించారు. ఆ సభకు లోఖండే నాయకత్వంలో సుమారు పదివేల మందిపైగా కార్మికులు ఆ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభలో జ్యోతిరావు పూలేతో పాటు అనేక మంది మహిళా కార్మికులు మాట్టాడారు. మొట్టమొదటి కార్మికుల భారీ బహిరంగ సభగా అది చరిత్రలో నిలిచింది. దీంతో మిల్లు యజమానులు సమావేశమై జూన్ 10న ఆదివారం సెలవుదినంగా ప్రకటించడానికి అంగీకరించారు. అలా ఆదివారం సెలవు మంజూరైంది.
లోఖండే రచనలే కారణం
1890లో భారత ప్రభుత్వం ఫ్యాక్టరీ లేబర్ కమిషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు లోఖండేను బొంబాయి ప్రెసిడెన్సీకి అసోసియేట్ సభ్యుడిగా పెట్టారు. 1891లో ఆమోదించిన ఫ్యాక్టరీ చట్టం నిబంధనలను రూపొందించడంలో లోఖండే రచనలే ప్రామాణికమయ్యాయి. అది జనవరి 1892 నుంచి ఉనికిలోకి వచ్చింది. అందులో వెంటిలేషన్, పారిశుధ్య సౌకర్యాలు కల్పించారు. 9 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలను పనిలో పెట్టుకోవడం నేరంగా పరిగణించడం, 9-14 సంవత్సరాల పిల్లలకు 9 గంటలు మహిళా కార్మికులకు 11 పనిగంటలు కేటాయించారు. అలాగే మహిళలు, పిల్లలకు నెలకు నాలుగు సెలవులు కేటాయించారు.
దీన్‌బంధు కార్మిక పత్రిక
మేఘాజీ లోఖండే1880 నుంచి1897లో తాను మరణించే వరకు మరాఠీలో దీన్ బంధు పత్రికకు సంపాదకుడిగా పనిచేశాడు. దేశంలోని మొట్టమొదటి కార్మిక పత్రిక ఇదే. ఈ పత్రికను 1877 లో భలేకర్ (జ్యోతిరావు ఫూలే సహోద్యోగి) ప్రారంభించారు. కాని కొంత కాలం తర్వాత ఆర్థిక భారం వల్ల ఆగిపోయింది. కొంత మంది స్నేహితుల సహాయంతో లోఖండే ఆ పత్రికను తాను మరణించే వరకు నిరంతరాయంగా ప్రచురించారు. అందులో కార్మిక, సామాజిక సమస్యలతో పాటు, హిందూ-ముస్లిం ఐక్యత కోసం ఎన్నో రచనలు చేశారు.
మహిళా కార్మికుల మొదటి నిరసన
మన దేశంలో మొదటి సారిగా మహిళా కార్మికుల నిరసన ప్రదర్శన చేయించిన ఘనత కూడా లోఖండేకే దక్కుతుంది. 25 మార్చి 1895 న బొంబాయిలోని జాకబ్ మిల్స్‌లో ఆయన ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనాలు, వారపు సెలవులు, ఎనిమిది గంటల పని వంటి డిమాండ్లతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అలా మహిళా కార్మికులకు కూడా అండగా నిలిచాడు.
ఆగిన గళం
1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి విజృంభించినప్పుడు లోఖండే ప్రాణాలకు తెగించి చురుకుగా పాల్గొని ఎంతో మందికి తన సహాయ సహకారాలను అందించాడు. విషాదం ఏమిటంటే ఆ వ్యాధికే ఆయన బలయ్యాడు. 1897 ఫిబ్రవరి 9న ఆ కార్మిక శిఖరం నేలకొరిగింది. కానీ ఆయన అందించిన పోరాట స్ఫూర్తి ఎంతో మందికి ప్రేరణనిచ్చింది. బొంబాయిలో కర్మాగార కార్మికుల సమీకరణ, ఉద్యమం, అనేక సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా అలుపెరగని పోరాటం చేసిన నారాయణ్ మేఘాజీ లోఖండే భారతదేశ కార్మిక చరిత్రలో ఒక ప్రత్యేకమైన అధ్యాయంగా నిలిచాడు. ఒక రకంగా చెప్పాలంటే కార్మిక పోరాటాలకు బాటలు వేశాడు. లోఖండే ఆలోచన, ఆచరణ కార్మిక ఉద్యమానికి, పేదల జీవితాల మెరుగుదలకు బలమైన పునాదయ్యాడు. 1893లో బొంబాయిలో జరిగిన మత అల్లర్లలో బహుజనులను చైతన్యపరిచాడు. సుమారు 60 వేలకు మందిపైగా ప్రజలను సమీకరించి సభ నిర్వహించాడు.
లోఖండే కృషికి గుర్తింపుగా బ్రిటిష్ ప్రభుత్వం రావు బహుదూర్ బిరుదును ప్రదానం చేసింది. అలాగే మన ప్రభుత్వం మే 2005లో స్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది. ఆ తర్వాత కాలంలో ఆదివారం సెలవు రోజును ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి కూడా వర్తించింది. బ్రిటిష్ అనంతరం భారత ప్రభుత్వం కూడా ఆదివారం సెలవుదినంగా కొనసాగిస్తోంది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఏ ప్రకటనా దేశంలో ఇంత వరకు లేదనే విమర్శ ఉంది.
Click Here to Know the Full History of Sunday Holiday Reason
You can Also like these posts also