Menu

Telugu Writer Natarajan: గొప్ప సాహిత్యాన్ని అందించిన హోటల్ సర్వర్

Telugu Writer Natarajan

ఆకలి, అలజడి తరమికొట్టాయి..! బీదరికం ఇంట్లో తిష్టవేసింది.. అనారోగ్యం ఒంట్లో కొలువై కూర్చుంది..! ఊరుకాని ఊరు.. భాష కానీ భాష..! అయినా ఆ ఆకలి మంటతోనే సాహిత్యాన్ని సృష్టించాడు..! తన తోటి వాళ్లందరి జీవితాలను అందులో ఒలికించాడు. మనుషుల్లోని ఉద్వేగాలను తన కథల్లో పాత్రలను చేశాడు..!

Telugu Writer Natarajan

ఆ రచనలు చదివిన ప్రతి ఒక్కరు. ఇది నా జీవితం అనుకునేంత గొప్ప సాహిత్యాన్ని అందరికీ అందించాడు.  అతనే ఎస్‌. నటరాజన్‌. అతను తమిళుడు శారద అనే కలం పేరుతో తెలుగులో అద్భుతమైన కథలు, నవలలు రాసి ఒక సాదా వ్యక్తిగానే  మిగిలిపోయాడు. కానీ నటరాజన్ తన నుంచి తన చుట్టూ జీవితాల్లోకి తొంగి చూసిన ఓ అసాధారణ వ్యక్తి.

ఎస్‌. నటరాజన్‌ తమిళనాడులో (NARARAJAN) పుట్టి 12 ఏళ్ల వయస్సులో పొట్టకూటి కోసం ఆంధ్రాలో తెనాలి (TENALI) ప్రాంతానికి వచ్చిన వలస జీవి. తెలుగు తెలియదు. అప్పటికే తమిళ సాహిత్యాన్నే గాక తమిళంలో వచ్చిన విదేశీ సాహిత్యాన్ని చదివాడు.

Telugu Writer Natarajan

తెలుగు గడ్డకు చేరిన ఆ సాహిత్య పిపాస భాష మీద మమకారంతో తెలుగు నేర్చుకున్నాడు. తెలుగును చదివాడు. కనిపించిన వాళ్లందరినీ అన్నా తెలుగు పుస్తకాలుంటే ఇవ్వు చదివిస్తాను అని అడిగి మరీ నేర్చుకున్నాడు.

శారదకు ఉన్న చోటు పట్లా, భాష పట్లా కనబరిచిన శ్రద్ధా, ఆసక్తి వెకట్టలేనివి. శారద పరాయి రాష్ట్రం వాడనో, పరాయి భాష వాడనో ఒక క్షణం కూడా అనిపించనంతగా తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని రచించాడు. రాయడానికి కనీసం కాగితం కొనలేని పేదరికం. దొరికిన చిత్తుకాగితాల మీదే జీవిత వాస్తవాలను రాశాడు.

Telugu Writer Natarajan

పగలంతా హోటల్లో పని చేసి రాత్రిపూట రాసేవాడు. అలా శారద బతుకు బాట ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అతని జీవితం, రచనలు ఎంతో చెక్కు చెదరని ముద్రని వేస్తాయి.

Telugu Writer Natarajan

ప్రేమ, హింస సున్నిత హృదయాన్ని ఎంతగా కదిలిస్తాయో, కుదిపేస్తాయో అనుభవించాడు. సంక్షోభకరమైన జీవితాలకు సమాజం నీతి, నియమం, మంచీ-చెడు కనీసమైన భద్రతని ఇవ్వలేవన్న నిజాన్ని నిర్భయంగా తన కలంతో చెప్పాడు.

ప్రకృతిలో పుట్టి పెరిగిన మనిషి తోటి మనిషిని మనిషైనందుకే ప్రేమించిన దశనీ, కాలాన్నీ, స్థితినీ మార్చేసిన విలువలు ఎట్లా పుట్టుకొచ్చాయి. ఇలాంటి విలువలను మోస్తున్న సమాజంలో తెలిసో, తెలియకో చేసే పొరపాట్లకు, తప్పుకు ఒక మనిషి పట్ల, మరో మనిషి చేసే నిర్ణయం ఎలా అంతులేని ఆవేదనని మిగిలిస్తుందో ?

Telugu Writer Natarajan

మనిషినెట్లా అదృశ్యం చేస్తుందో శారద (Writer SARADA) చిత్రించాడు. బంధాన్నీ, ఉద్వేగాన్నీ ఎంతగా ఛిన్నాభిన్నం చేస్తాయో ఎవరికెవరం ఏమీ కాకుండా ఏమైపోతామో కళ్లకు కట్టాడు. అందుకే శారదవి ఒట్టిగా కథనీ, నవలనీ అనలేం.

ఒక అసత్యానికి బలైపోయిన పార్వతి చావు ‘ఏది సత్యం’ అని ప్రశ్నిస్తే, బద్దలైపోయిన, బండబారిపోయిన బతుకుతో పద్మ, సరోజినీలు పెద్దల నిర్ణయాల్లోని ‘మంచీ చెడూ’ని నిలదీశారు. మరోపక్క వసంతం ఆకలి రగిలించిన ‘అపస్వరాన్నీ’ వినిపించకుండానే తనువుని చాలిస్తోంది.

ఇలా ప్రతీ నవలలోనూ శారద (SARADA) స్త్రీ జీవితాలన్నీ హృదయ విదారకంగా నిలిచాయి. కడుపు నింపని, స్వేచ్ఛనివ్వని నీతి, రీతి లోకంలో నడుస్తున్నంత కాలం శారద స్త్రీ పాత్రలన్నీ సజీవంగానే ఉంటాయి.

Telugu Writer Natarajan

మనిషి లోపలి పొరల్లోని  అసంతృప్తులో ?  అవహేళనలో ?  భయమో ? భక్తో ? అతిశయమో ? నాదేననే భావమో ? నాది కాదేమోననే అభద్రతో ? ప్రతీది కావాలనే కాంక్షో ? దక్కదేమోననే ఈర్ష్యో? మనిషినెంత అతలాకుతం చేస్తాయో… అద్దంలా చూపించాడు.

శారద రచనల్లోని ప్రతి పాత్ర అభద్రత, ఆకలీ నిండిన కళ్లతో, ప్రేమనీ, మోహాన్నీ, ఉత్సాహాన్నీ, ఉద్రేకాన్నీ మరచిపోయి నైరాశ్యంలో కొట్టుకుపోవడాన్ని చూస్తాం.

ఆకలి, అవసరం మనిషిలోని సుగుణాన్నీ, సున్నితత్వాన్ని చంపేయడాన్నీ చూస్తాం. నటరాజన్‌ హోటల్లో చాకిరీలో మగ్గిపోయాడు. మజ్జిగమ్మాడు. బజ్జీలమ్మాడు. దారిద్య్రంలోనే బతుకీడ్చాడు. ఆకలితో, అనారోగ్యంతో కాలం వెంబడి పరిగెత్తాడు.

ఏ అవస్థలోనూ తన గమ్యాన్ని విడిచిపెట్టలేదు. సాహిత్య శ్రమలో మునిగితేలాడు. నటరాజన్‌ కడు పేదరికంలో కొట్టుకుపోతూనే శారదగా సాహిత్య పూలు చల్లాడు.

అవి యుగాలైనా వాడిపోని, చెదిరిపోని  పూలు. ఏడు దశాబ్ధాల తర్వాత కూడా ఇదిగో ఇలా మనల్ని పలకరిస్తూనే ఉన్నాయి. ఆర్ధ్రంగా, ఆత్రంగా సమాజం వైపు చూస్తూనే ఉన్నాయి. అలాంటి గొప్ప రచయిత చివరికి మూర్ఛవ్యాధితో 32 ఏళ్లకే కనుమరుగై తెలుగు సాహిత్యంలో పూడ్చలేని లోటును మిగిల్చాడు. తెలుగు రాదు, తెలుగు వాడు కాదు. కానీ నటరాజన్‌ తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఎందుకంటే ఆయన రాసిన కథలు, నవలలకి కన్నీళ్లే సిరా. వ్యక్తుల జీవితాల్లోని కల్లోలాలే సిసలైన ముడిసరుకు. ఆయన రాసినవి కథలు కాదు.. జీవితాలు.  అందుకే తెలుగు సాహిత్యంలో మన శారదగా నిలిచిపోయాడు.

                                                                                                                                         ..అన్నపూర్ణ..

థామస్ అల్వా ఎడిసన్ కుట్రలు… వెలుగులు పంచిన నికోలా టెస్లా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *