The Great Indian Kitchen Telugu
“ది గ్రేట్ ఇండియన్ కిచెన్” (The Great Indian kitchen) సినిమా మొదట 2021 మలయాళంలోనే వచ్చింది. ఈ చిత్రాన్ని విమర్శకులు సైతం శభాష్ అన్నారు. ఇదే సినిమా రీసెంట్‌గా తమిళంలో రిమేక్ చేసి.. తెలుగు, కన్నడ భాషల్లోనూ ఓటీటీలో విడుదల చేశారు. ఈ సినిమాకి ఆర్.కణ్ణన్ డైరక్టర్. ఈ సినిమాపై సోషల్ మీడియాలో చాలామంది ఆడవాళ్లు స్పందిస్తున్నారు. నిజానికి మగవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.
The Great Indian Kitchen కథ ఇది…
ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్ వెర్షన్‌లో ఐశ్వర్యరాజే ష్ (Aishwarya Rajesh), రాహుల్ రవీంద్రన్(Rahul Ravindran) కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఐశ్వర్య రాజేష్ క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది. అయితే ఆమెకు ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేసే రాహుల్ రవీంద్రన్‌తో పెద్దలు పెళ్లి చేస్తారు. రాహుల్ రవీంద్రన్ కుటుంబ సభ్యులు ఆడవాళ్లు ఇంటికే పరిమితం కావాలని, ఇంటి పనులు చేయడమే ఆడవాళ్ల బాధ్యత అని రాహుల్ రవీంద్రన్‌తో పాటు అతడి తండ్రి నమ్ముతుంటారు. ఎన్నో కలలతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఐశ్వర్యరాజేష్ అత్తింటి కట్టుబాట్ల కారణంగా వంటింటికే పరిమితం అయిపోతుంది. పెళ్లైన కొన్నిరోజులకే ఐశ్వర్య రాజేష్‌కి ఆ ఇంటి పరిస్థితి అర్థమైపోతుంది. భర్తకు, మామకు రెండు రకాల టిఫిన్లను, రెండు రకాల పచ్చళ్లు, రెండు రకాల భోజనాలు ఉండాలి. ఎవరి అభిరుచికి తగినట్టు చేయాలి.ఇదే విధంగా అత్తా కోడళ్లుు ఒకరికొకరు సాయం చేసుకుంటూ పని చేసుకుంటారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేశ్ అత్త ఆమె కూతురి దగ్గరకు వెళ్తుంది. దాంతో ఇంటి పని బాధ్యత అంతా ఐశ్వర్య రాజేష్‌పైనే పడుతుంది. పచ్ఛళ్లు (మిక్సి ఉన్నా) రుబ్బురోళ్లలో నూరాలి, అన్నం కట్టెల పొయ్యి మీదే వండాలి. పీరియడ్స్ అయితే బయటే ఉండాలి. ఇలాంటి రూల్స్ మధ్య ఐశ్వర్య రాజేశ్ పనులు చేసి, చేసి విసిగిపోతుంది.
The Great Indian Kitchen Telugu
వాస్తవానికి ఆడవాళ్లను బతికుండగానే నిర్జీవంగా మార్చేయగలిగే గొప్ప శక్తి మన ‘ఇండియన్ కిచెన్‌కే’ ఉంది. ఈ చేదు నిజాన్నే సినిమాలో చూపించారు. ఆడవాళ్ల కలలు, ఆశలు, కోరికలు వంట గదుల్లో ఆవిరైపోతాయి. ఉప్పు చూడడానికో, కారం సరిగ్గా వేయడానికో, అప్పడం కరెక్ట్‌గా వేగించడానికో వారి ప్రతిభ కుదించుకుపోతుంది. వంట అంటే పెద్ద పని కాదని చాలామంది మగవాళ్ల అభిప్రాయం. కొంతమంది కేవలం ప్లేట్‌లో వేడి వేడిగా వచ్చే టీలు, టిఫిన్లు, కూరలు, అన్నం మాత్రమే చూస్తారు. దానికోసం ఆడవాళ్లు వంటింట్లో కాల్చుకునే చేతులను, ఆ వేడి సెగలో మాడిపోయే ఆడవాళ్ల మొహాలని, కార్చుకునే చెమటని ఎవరూ చూడరు. ఇక వంట చుట్టూ ఉండే ఉప పనులు గురించి చెప్పుకోవాలి. కూరగాయలను కోయడం, వలవడం ఇలాంటి పనులకు ఓ రూపం ఉండదు. ఆ ఉప పనులు లేకుండా వంట పూర్తవ్వడం సాధ్యమే కాదు. ఆ పనుల వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో, ఎంత శ్రమ పెట్టాలో ఒక్క ఆడవాళ్లకే తెలుస్తుంది.
The Great Indian Kitchen Telugu
సమాజంలో కొన్ని మార్పులు వచ్చాయి. కిచెన్‌లో ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు వచ్చి చేరాయి. కానీ వంట పని చేయడం విషయంలో మార్పు రాలేదు. అది ఇప్పటికీ ఆడవాళ్ల పనే. వంట గది ఆడవాళ్లదే. ఆడవాళ్లు సరదాగా బయటకెళ్లినా, పని మీద బయటకెళ్లినా, ఉద్యోగానికి వెళ్లినా ఇంటికొచ్చేసరికి ఆమె కోసం కచ్చితంగా వంట గది ఎదురుచూస్తుంటుంది. ఎందుకంటే అది మగవాళ్ల పని కాదు కదా. అందుకే ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమా స్టోరీ ఇప్పటికీ ప్రతీ ఇంట్లో నిత్యం జరుగుతూ ఉన్న కథే. ఆ సినిమా చూస్తున్నంత సేపు మహిళల కళ్లలో ఒక తడి హృదయాన్ని తాకుతుంది. ఈ సినిమాను చూసిన ప్రతి ఇండియన్ మహిళ కథానాయిక పాత్రలో తననే చూసుకుంటుంది.
ఈ సినిమాలో తన అభిరుచికి తగ్గట్టుగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఒక మధ్య తరగతి అమ్మాయి జీవితంలో పెళ్లి ఎలాంటి మార్పును తీసుకొచ్చిందో చూడొచ్చు. అందమైన కళ, భవిష్యత్తు పట్ల కలలు ఉన్న ఓ అమ్మాయి మన ఇండియన్ కిచెన్‌లో ఎలా మగ్గిపోయిందో, ఇంటి భార్య పట్ల, కోడలు పట్ల ఆ ఇంటి మగవాళ్లు వ్యవహరించిన తీరు, వారి అహంకారాల మధ్య ఎలా నలిగిపోయిందో కళ్లకు కట్టినట్టు చూపించారు.
The Great Indian Kitchen Telugu
వంటగదిలో (The Great Indian Kitchen Telugu) కనిపించని ఆ చాకిరీ మహిళల్లో సహజత్వాన్ని, ఆలోచనల్ని చంపేస్తుంది. వాళ్లేం చదువుకున్నారో, వాళ్లకేం కావాలో తెలియకుండా.. వాళ్లేం అవ్వాలనుకున్నారో వాళ్లే మర్చిపోయేలా చేస్తుంది. మనసుని కాల్చేస్తుంది. జీతం ఉండదు, సెలవు ఉండదు, రెస్ట్ ఉండదు. ఏదో ఒక పనిని నిత్యం మహిళల మెదడు మోస్తూనే ఉంటుంది. అదే మూవీలోనూ చూపించారు.
బయట రెస్టారెంట్లు. స్ట్రీట్ ఫుఢ్ సెంటర్ లు, నైట్ ఫుడ్ బజార్లు ఎన్ని ఉన్నా ప్రతి ఇంట్లోనూ భర్త రుచులు, పిల్లల అభిరుచుకులకి అనుగుణంగా మహిళలే కిచెన్‌ని నడపాలి. అందరికి చేశాక వాళ్లకిష్టమైనవి, వాళ్లకి ఆరోగ్యాన్నిచ్చేవి చేసుకునే ఓపిక లేక మిగిలిన వాటితో సర్దుకు పోతుంటారు. ఇంటిళ్లపాదికి అన్నీ అమర్చి మిగుళ్లు, తగుళ్లు చివరాఖరున వేస్ట్ అయిపోతాయని తిని తృప్తి పడుతుంటారు. విరామం కోసమో, తన అభిరుచుల కోసమో, తన ఆశయాల కోసమో వంట పనిలో భాగం పంచుకోమంటే భర్తల నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ వ్యవస్థ పట్ల, కుటుంబం పట్ల గౌరవం లేదంటూ నిందలు, బాధ్యత లేని భార్యగా, తల్లిగా ట్రీట్ చేస్తారు. కిచెన్ లేకపోతే కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుందంటూ గగ్గోలు పెడతారు.
The Great Indian Kitchen Telugu
తరాలు మారుతున్నా మన ఇండియన్ కిచెన్ మాత్రం మారడం లేదు. వంటపని ‘ఆమె’ కే కేటాయించబడుతుంది. ఇంటిళ్లపాదికి వంట చేసి పెట్టినా ఆమెకు కనీస గౌరవం, గుర్తింపు ఉండదు. పైగా ఉప్పు ఎక్కువైందనో, తక్కువ వైందనో, దోశ మాడిపోయిందనో తిట్లు, విసుగులు, ఈసడింపులు మాత్రం గ్యారంటీ. ముఖ్యంగా మగవాళ్లు సరిగ్గా, శ్రద్దగా చేయడం లేదనే విమర్శించడంతో పాటు.. ఇలా చేయాలి, అలా చేయాలనే టన్నుల కొద్దీ సలహాలు కూడా ఇస్తుంటారు.
మొత్తం కుటుంబానికి అవసరమైన ఒక పనిని కుటుంబం పంచుకోదు, పట్టించుకోదు. వంట పని, ఇంటి పని కేవలం మహిళలు మాత్రమే చేయాల్సిన పనులుగా సమాజం చూస్తున్నంత కాలం మన ‘ఇండియన్ కిచెన్’ కథ మారదు. ఇది ఆడ పనే అనే కనిపించని అదృశ్య ఇటుకలతో కట్టిన కంచుకోట మన ఇండియన్ కిచెన్.
…Annapurna Andaluri…