Vasily Sukhomlinsky Telugu
మనం చదువుకునే విద్య విలువలను నేర్పించాలి.. మానవత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని పెంచాలి. ఆత్మ విశ్వాసం ఉంటే ఎవరైనా ఏదైనా చేసుకుని బతకగలరు. మానవత్వం ఉంటే తోటి మనుషులను తమతో పాటు నడిపిస్తారు. గెలిపిస్తారు. అందుకే మన ఎడ్యుకేషన్ లక్ష్యం కచ్చితంగా హ్యుమానిటీ పెంచడమే అయి ఉండాలి. ఇది సాధ్యమా..? అనే డౌట్ రావొచ్చు. కానీ ఒక టీచర్ దీనిని చేసి చూపించాడు. అతనే సుహోమ్లిన్ స్కీ.
Vasily Sukhomlinsky
ఆకాశంలోకి రాకెట్లు పంపించి అంతు చిక్కని రహస్యాలు ఛేదించే సైంటిస్టులతో పాటు.. సమాజంలోని ప్రతి ఒక్కరిని మనస్సున్న మనుషులుగా తీర్చిదిద్దే టీచర్లు అంతకంటే ఎక్కువ అవసరం. అలాంటి ఉపాధ్యాయుడే సుహోమ్లిన్ స్కీ. బట్టి పట్టీ చదివించే విధానానికి చెక్ పెట్టాడు.
పాఠాలను మెదళ్లల్లో నూరిపోయకుండా వారు ఏం ఇష్టపడతారో దానినే చెప్పాడు. పిల్లలను యంత్రాల్లా కాకుండా.. పిల్లలుగానే చూశాడు. పిల్లలను క్లాస్ రూమ్‌కు పరిమితం చేయకుండా.. ప్రకృతిలో మమేకం చేశాడు.
అందుకే ‘‘స్కూల్ ఆఫ్ జాయ్’’ సృష్టికర్తగా సుహోమ్లిన్ స్కీ ప్రసిద్ధి. టీచింగ్ విధానానికి సంబంధించి సుహోమ్లిన్ ఎన్నో పుస్తకాలను రాశాడు. వాటిని ఉక్రెయిన్, చైనా, రష్యాల్లో లక్షలాది మంది టీచర్లు చదివారు. అలాంటి గొప్ప టీచరైన సుహోమ్లిన్ 1918..సెప్టెంబర్ 28న ఉక్రెయిన్‌లో పుట్టారు.
Vasily Sukhomlinsky
ఒక వ్యక్తిలో గొప్ప ఆశయాలు, లక్ష్యాలు ఏర్పడ్డానికి సమాజంలోని పరిస్థితులే కారణమవుతాయి. ఆందోళనలు, కల్లోలాలు, కరువు, అవినీతి, అక్రమాలు, హత్యలు, దొంగతనాలు, అనైతికత… ఉన్నప్పుడు సొసైటీ ఇలా ఉండకూడదని కచ్చితంగా ఎవరైనా అనుకుంటారు.

సమాజం మారాలని మాటవరసకైనా భావిస్తారు. సుహోమ్లిన్‌లోనూ అవే భావాలు ఉన్నాయి. అందుకే రేపు సమాజం ఇలా ఉండకూడదని, ఒక మనిషి.. ఇంకో మనిషిని కొట్టడం అనే కల్చర్ దూరమవ్వాలని బలంగా భావించాడు. కేవలం భావించి ఊరుకోలేదు.. తను ఎంచుకున్న వృత్తి నుంచే దాని కోసం ప్రయత్నించాడు. తీవ్రంగా కృషి చేశాడు.
Vasily Sukhomlinsky
1941లో సుహోమ్లిన్ యంగ్ టీచర్. ఆ సమయంలో సోవియట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు యుద్ధంలో పోరాడేందుకు సుహోమ్లిన్ వెళ్లాల్సి వచ్చింది. ఆ యుద్ధ భూమిలో తీవ్రంగా గాయపడ్డాడు. అతని చెస్ట్‌లో బుల్లెట్‌కు సంబంధించిన శకలం దూసుకుపోయింది. దీంతో మిలట్రీలో పనిచేయడానికి అర్హతను కోల్పోయాడు. 1944లో జర్మనీ ఆక్రమణ నుంచి మాతృభూమి విముక్తి పొందే వరకు యురల్స్‌లోని పాఠశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు.
ఆ టైంలో అతని భార్యా,బిడ్డలను, తండ్రిని కోల్పోయాడు. వారిని ఓ అధికారి చంపినట్టు తెలిసింది. చాలా బాధపడ్డాడు. అయితే అతి త్వరలోనే ఆ విషాదం నుంచి బయటపడ్డాడు. అసలు ఇలాంటి దారుణాలు మనుషులు ఎలా చేయగలుగుతున్నారనే ఆలోచనలు ఆయనలో కలిగాయి.
ఆ అనుభవం నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాడు. మానవత్వాన్ని పెంపొందించే విద్యా పద్ధతిని అభివృద్ధి చేయాలని సంకల్పించాడు. అమానవీయ ప్రవర్తన ఉండకూడదని, అలాంటి మంచి విద్యను పెంపొందించాలని నిర్ణయించుకున్నాడు. అనుకోవడమే కాదు ఆచరణలో కూడా పెట్టాడు. తన కలలను తను స్థాపించిన సొంత పాఠశాలలో అప్లై చేశాడు.
Vasily Sukhomlinsky
పవ్లీష్ అనే గ్రామంలో ఓ స్కూల్‌ను పెట్టి ప్రిన్సిపాల్‌గా వ్యవహరించాడు. 1948 నుంచి 1970 వరకు అంటే తను మరణించే వరకూ ఆ స్కూల్‌ను నడిపంచాడు. ఆ స్కూల్లో తాను అనుకున్నది అనుకున్నట్టుగా అన్ని చేశాడు. చాలా క్రమశిక్షణ గల ఆయన ఉక్రెయిన్ భాష, సాహిత్యాలను బోధిస్తూనే, మిగతా టీచర్లకు గైడెన్స్ ఇచ్చేవాడు.
వారు పాఠాలు చెప్పే విధానాన్ని పర్యవేక్షించడం, మెళకువలను నేర్పించడం, పిల్లల తల్లిదండ్రులతో టచ్‌లో ఉండడం వంటి పనులు చేస్తుండేవాడు. నెలకు రెండుసార్లు పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడేవాడు. పిల్లల పాఠాలే కాదు.. అవసరాలను తీర్చేవాడు.

Vasily Sukhomlinsky
సుహోమ్లిన్ ప్రతి వ్యక్తి పెరుగుదలను ప్రోత్సహించే విధానాన్ని సమర్థించాడు. బాల్యం నుంచే పిల్లలను విద్యా వంతులను చేయవలసిన అవసరాన్ని నొక్కి చెప్పాడు. ముఖ్యంగా పిల్లలకు ఇతరుల అంతర్గత ప్రపంచం గురించి తెలుసుకోవడం నేర్పించాడు.
ఇతరుల కళ్లు చదవడం, ఆనందాన్ని, దు:ఖాన్ని గుర్తించడం, ఇతరుల్లో గందరగోళ భావనలను గుర్తించడాన్ని పిల్లలకు నేర్పించాడు. ఇతరుల పట్ల కన్సర్న్ ఉండే విధంగా .. తమ తోటి మనుషుల మనస్సులను అర్థం చేసుకునే విధంగా విద్యను రూపొందించి పిల్లలకు పాఠాలుగా అందించేవాడు. పిల్లలు అందరూ విద్యాపరంగా రాణించక పోవచ్చని, కానీ ప్రతి ఒక్కరూ ఏదో ఒకదానిలో ప్రతిభ కలిగి ఉంటారని సుహోమ్లిన్ నమ్మాడు.
అదే వారి ఆత్మగౌరవం, వారి నైతిక వికాసానికి పునాది అని విశ్వసించాడు. దానినే నిజ జీవితంలో అప్లై చేశాడు. అంతేకాదు 500కిపైగా వ్యాసాలు, 30 పుస్తకాలను రాశాడు. అందులో చాలా వరకూ అతను చనిపోయాక పబ్లిష్ అయ్యాయి. వేలాదిమంది టీచర్లు సుహోమ్లిన్ స్కూల్‌ను సందర్శించి. ఆయనకు నివాళులు అర్పించేవారు.
Vasily Sukhomlinsky
సుహోమ్లిన్ పూర్తి పేరు వాసిల్ ఒలెక్సాండ్రోవిచ్ సుహోమ్లిన్‌స్కీ. విద్యా రంగంలో సాధించిన విజయాలకు సుహోమ్లిన్స్కీకి 1968లో హీరో ఆఫ్ సోషలిస్ట్ లేబర్ అనే అవార్డు లభించింది. అంతేకాదు రెండు ఆర్డర్స్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ ది రెడ్ స్టార్, ఉషిన్స్కీ, మకరెంకో మెడల్స్‌ను అందుకున్నాడు. 1967 నుంచి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.
ఛాతిలో మిగిలిపోయిన లోహపు శకలం గుండెల్లోకి వెళ్లిపోయాయి. ఆపరేషన్ చేసిన ప్రయోజనం లేకపోయింది. దీంతో సెప్టెంబర్ రెండో తేదీ 1970లో మరణించాడు. అతని అంత్యక్రియలకు ఆ గ్రామస్థులు మొత్తం హాజరయ్యారు.
ఎవరికైనా తన దేశం, సమాజం గొప్పగా ఉండాలనే స్వార్థం కచ్చితంగా ఉండాలి. దానికి కొన్ని అభ్యుదయ భావాలు చాలా అవసరం. అయితే ఎంతటి గొప్ప ఆలోచనలు, ఆశయాలలైనా ఆచరణ ఉంటేనే సత్ఫలితాలు ఉంటాయి. ఏదో ఒక స్థాయిలో రిజల్ట్ ఉంటుంది.
దానికి సుహోమ్లిన్ స్కీ గొప్ప ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం చెప్పలేదనో.. మౌలిక వసతులు లేవనో.. విమర్శలు వస్తున్నాయో.. సుహోమ్లిన్ ఆగిపోలేదు. జీవితంలో 30 ఏళ్లను పిల్లల కోసం అంకితం చేశాడు.
You can Also like these posts also
టెర్రరిస్ట్ టూ అడ్వకేట్ : షహీద్ అజ్మీ