We are with Farmers
వాయిస్ వినిపించడమే కాదు.. కదిలి వస్తున్నారు. నిరసనలో కలిసి కూర్చుంటున్నారు. అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నారు. రైతుల ఉద్యమంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకుంటున్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తోన్న పోరాటానికి సెలబ్రిటీలు మద్దతునిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖులు, స్పోర్ట్స్ స్టార్స్, సింగర్స్ అని తేడా లేకుండా వాళ్లతోపాటు మేము ఉన్నాం అంటూ.. కదలి వస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో ఓపెన్‌గా తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు.
చలిని, ఆకలిని లెక్కచేయకుండా.. వెనక్కి తగ్గకుండా జరుగుతున్న రైతుల పోరాటం.. మన దేశ చరిత్రలో సరికొత్త అధ్యయాన్ని లిఖించే దిశగా సాగుతోంది.
పైగా ఈ ప్రొటెస్ట్‌పై అన్ని రంగాల ప్రముఖులు విస్తృతంగా స్పందిస్తున్నారు. ఈ దేశ రైతుకు కష్టం వస్తే.. ఊరుకునేది లేదని చెప్పకనే చెబుతున్నారు.
We are with Farmers
తమ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరిస్తున్నారు. కొందరు నిరసనలో పాల్గొంటున్నారు. మరికొందరు సోషల్ మీడియాలో తమ మద్దతును బాహాటంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఆ ఉద్యమంపై ఎంతో బాధ్యాతయుతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
We are with Farmers
పంజాబీ సింగర్ దిల్జిత్ దోసాంజ్ మొదటి నుంచి రైతు ఉద్యమానికి అండగా నిలుస్తున్నారు. ఈ నిరసనకు సంబంధించి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలను అంతే ధీటుగా వ్యతిరేకించారు.
అంతేకాదు ఢిల్లీలోని రైతుల నిరసన కార్యక్రమంలోనూ పాల్గొని.. రైతులకు మద్దతుగా ప్రసంగించారు.
We are with Farmers
అలాగే నటి స్వరా భాస్కర్ కూడా స్వయంగా రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను తినే రోటి రైతుల వల్లే లభ్యమవుతుందని, అందుకే వారికి సంఘీభావాన్ని తెలిపేందుకు వారి పోరాటంలో భాగమయ్యానని ఆమె అన్నారు.
అదేవిధంగా ప్రముఖ బాక్సర్ విజేందర్ సింగ్ రైతుల ఆందోళనకు సంఘీభావం తెలిపారు. నిరసనలో పాల్గొన్న రైతులకు ఓ సంస్థ ఏర్పాటు చేసిన ఫుడ్‌ను అందజేశారు. అంతేకాదు ప్రభుత్వం తనకు అందజేసిన ఖేల్ రత్న అవార్డును వెనక్కి ఇచ్చేనని ప్రకటించాడు.
We are with Farmers
అలాగే నటి సోనమ్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో రైతుల నిరసనల ఫోటోలను షేర్ చేశారు. అంతే రైతులు మానవ నాగరితకు స్థాపికులుగా అభివర్ణించారు. ప్రముఖ నటి ప్రియాంక చోప్రా కూడా ‘‘మా రైతులు భారత దేశ ఆహార సైనికులు, వారి భయాలను తొలగించాల్సిన అవసరం ఉంది. వారి ఆశలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్యంగా, ఈ సంక్షోభం త్వరలోనే పరిష్కరించబడేలా చూడాలి. ” అంటూ ట్వీట్ చేశారు.
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ కూడా రైతులకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈరోజు మనం అన్నం తింటున్నామంటే అది రైతుల చలువే.. అందుకే దేశంలోని ప్రతి రైతు పక్షాన నేను నిలబడతా అంటూ ట్వీట్ చేశారు. వీళ్లే కాదు సోనూసూద్, తాప్సీ పన్నూ, హన్సాల్ మెహతా, హాస్యనటుడు కపిల్ శర్మ వంటి ప్రముఖులు రైతుల నిరసనకు తమ మద్దతును అందించారు.
We are with Farmers
ఏ రంగంలోనైనా ఉండొచ్చు.. ఎంతైనా సాధించి ఉండవచ్చు. కానీ సమాజం పట్ల బాధ్యతను విస్మరించకూడదు. కనీసం సమయం వచ్చినప్పుడన్నా.. మనం సరిగ్గా స్పందించాలి. ఇప్పుడు చేయాల్సింది.. అదే. అందుకే రైతుల వెంటే.. మేము అంటూ ఒక్కొక్కరుగా కదులుతున్నారు. స్వరం కలుపుతున్నారు.