Writer Kaloji Narayana Rao
అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి. అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి అన్నాడు కాళోజి. ఈ విశాల ప్రపంచం కోసం తన అంతరాంతరాల్లో పడుతున్న ఘర్షణను ఒక్క వాక్యంలో చెప్పాడు. తనని చదివిన వారి మనస్సులో సూటిగా గుచ్చుకునేట్టుగా చెప్పాడు.
ఇంత విశాలమైన ప్రగాఢమైన అభిప్రాయాలున్నవాడు కాబట్టే అతను అస్తవ్యస్తమైన ఈ సమాజాన్ని పట్టించుకోకుండా కుదురుగా ఉండలేకపోయాడు. ‘నా గొడవ’గా వల్లించాడు. ఎందుకంటే పాలకులు ఎంత క్రూరంగా ఉంటారో పాలితులు ఎంత భయానకమైన పరిస్థితుల్లో బతుకుతారో తెలిసిన వ్యక్తి. తెల్ల పాలకులను చూశాడు. నల్ల పాలకులను చూశాడు. నిజాం పాలకులను చూశాడు.
Writer Kaloji Narayana Rao
బహుశా అందుకేనేమో తన జీవితమంతా అణగారిన సమూహాల కోసం కవిత్వం రాశాడు. హక్కులడిగాడు. ఉద్యమాలు నడిపాడు. పాలకుల దమన నీతిని, దౌర్జన్యాలను తన గళంతో కలంతో నిగ్గదీశాడు. హింస తప్పు, రాజ్య హింస మరీ తప్పు అని ప్రకటించిన నిజమైన ప్రజాకవి కాలోజి.
స్వాతంత్రం కోసం పాటు పడ్డాడు. తెలంగాణ కోసం ఆరాటపడ్డాడు. యావత్ సమాజ విముక్తి కోసం ఆశపడ్డాడు. అనేక సార్లు జైలుకెళ్లాడు. నగర బహిష్కరణకు గురయ్యాడు.
‘‘ఆగిపోవుటె చావన్నాడు.
సాగిపోవుటె బ్రతుకన్నాడు.
తొలగి తోవెవడిచ్చు
త్రోసుకొని పోవలన్నాడు.’’
Writer Kaloji Narayana Rao
ఈరోజు ఆదర్శం అంటే ఒక ఆభరణం. ఉద్యమం అంటే ఒక ఉద్యోగం ఒక హోదా. ఎందుకంటే ఎంతోమంది రక్త తర్పణలు చేసి, అమూల్యమైన త్యాగాలు చేసి తెలంగాణను సాధిస్తే ఎంతమంది రచయితలు కవులు, కళాకారులు పాలకుల పక్కన పీఠాలేసుకుని కూర్చున్నారు.
ఎన్ని ఘోరాలు జరిగినా రాజ్యహింస ఎంత పరాకాష్టకు చేరినా కలాలు, గళాలు ఎత్తలేని హీన స్థితిలో ఉన్నారిక్కడ. కానీ కాళోజి ఆదర్శానికి, నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. విజ్ఞానాన్ని ఉద్యమాన్ని మోసే ఒక నిరంతర రుషిలా పనిచేశాడు.
పాలకులు మారినా.. ప్రాంతాలు మారినా ఒక్కటే నినాదం ప్రజలు బాగుపడాల. పుట్టుక చావు తప్ప బతుకంతా దేశానిది అని నిరూపించిన గొప్ప వ్యక్తి కాళోజి. ఎక్కడో కర్ణాటకలో పుట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడ్డాడు. ఆనాటి నుంచి మరణించేవరకు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, ఆవేదనను, ఆగ్రహానికి అద్దం పట్టాడు.
Writer Kaloji Narayana Rao
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గొడవ గొడవ చేశాడు. అంతేకాదు పాలించ వచ్చిన ప్రతి ఒక్కడు వాళ్ల భాష గొప్పదన్నాడు. చివరకు సాటి తెలుగోళ్లు కూడా తెలంగాణ యాసను భాషను సంసృతిని తప్పు బట్టారు. తప్పు పట్టిన ప్రతి ఒక్కరినీ సహృదయతను పెంచుకోమన్నాడు.
Writer Kaloji Narayana Rao
మన భాష, మన యాస మనమే గౌరవించుకోవాలన్నాడు. కాపాడుకోవాలన్నాడు. భాష అంటే గుర్తొచ్చింది. కాళోజి గూర్చి చలసాని ఒక సందర్భం చెబుతుండేవాడు. తెలంగాణలో మనుషులని తోలుకురా అంటారు. తోలుకు రావడం ఏంటీ..? తోలుకురావడం అంటే పశువులా అని ఆంధ్రా అతను ఆక్షేపిస్తే కాళోజి అన్నాడట.. ఆంధ్రాలో మనుషలని తీసుకురా తీసుకెళ్లు అంటారు. వస్తువులనే తీసుకురా తీసుకెళ్లు అంటాం. వస్తువులతో పోల్చడం కంటే జీవం ఉన్న పశువులతో పోల్చడం మంచిదే కదా అన్నాడట. కాళోజీకి భాష పట్ల అంత అమితమైన ప్రేమ. అందుకే కాళోజి జయంతి రోజును తెలుగు భాషా దినంగా జరుపుకుంటున్నారు.
కాళోజి 1914, సెప్టెంబరు 9న కర్ణాటక రాష్ట్రం, బీజాపూర్ జిల్లా లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతను తల్లి రమాబాయమ్మ, కన్నడ. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు. కాళోజి కవిగా అనేక భాషల్లో తెలుగు, ఉర్ధూ, హిందీ, మరాఠీ, కన్నడ, ఇంగ్లీషు భాషల్లో ఎంతో పేరు పొందారు. ఆయన రాసిన ‘నా గొడవ’ ఉత్తమ రచన.
తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడిగా కొనసాగారు. 1930 నుంచే కాళోజీ గ్రంథాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నదే ఆయన ఆకాంక్ష. ప్రత్యేక తెలంగాణ వచ్చినా అది ఈనాటి వరకు నెరవేలేదు.
Writer Kaloji Narayana Rao
‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అన్న కాళోజికి ప్రభుత్వమే జయంతి ఉత్సవాలు నిర్వహిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కాళోజినీ నిజంగానే గౌరవిస్తుందా..? ఎవరికి నివాళి ఇస్తుంది. కాళోజికా ఆతనిలోని ఆదర్శాలకా..? ఆకాంక్షలకా..? అర్థం చేసుకోవచ్చు. బంగారు తెలంగాణకు బదులు హింసకు, కాషాయ మూకలకు తొవ్విస్తున్న కేసీఆర్‌కు కాళోజిని గౌరవించే అర్హత ఉందా..? అనే ప్రశ్నలు రాక మానడం లేదు.
90 ఏళ్ల పాట జీవించిన ఆయన తెలంగాణ ప్రాంతంలో జరిగిన అన్ని పోరాటాల్లోనూ పాల్గొనడమే కాదు.. ప్రధాన పాత్ర పోషించారు. ఎన్ని విమర్శలొచ్చినా.. ఎన్ని అడ్డంకులు పెట్టినా.. కాళోజీ తన పంథాను ఏ మాత్రం వీడ లేదు. తిరస్కరణ, దిక్కారణ ఆయన జీవితంలో ప్రధాన భూమికలు. నచ్చనదేదైనా సరే నిర్మోహమాటంగా చెప్పడం.. ఆయన శైలి.
Writer Kaloji Narayana Rao
రాజ్యాన్నైనా.. ప్రజలనైనా సరే.. నిలబెట్టి కడిగేయడం ఆయన వైఖరి. పొగడ్తలు, ప్రశంసలు, ప్రయోజనాలు, ప్రలోభాలు ఇలాంటి వేటికీ తావు లేకుండా కాలోజీ బతికాడు. బహుశా.. ఇలా బతకడం అసాధ్యమనే చెప్పుకోవాలి. అలా శారీరకంగానే కాదు.. మానసికంగానూ కాళోజీ చాలా నిరాంబర వ్యక్తి. మనస్సులో ఒకటి.. మొహంపై ఒకటి పూసుకుని బతికే ఈ కాలంలో కాళోజీ ప్రస్తావనకు కూడా కొంచెం గుండె ధైర్యం ఉండాలి.
Writer Kaloji Narayana Rao
పోరాటపు జీవితంలో నే కాదు.. వ్యక్తిగత జీవితంలోనూ కాళోజీ ఎంతో నిజాయితీ పరుడు అందుకే ఆయన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. కాళోజీ పుట్టిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్ద చేశాడు.
లా చదివి కూడా కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా అన్నే ఇల్లు గడుపుతూ వచ్చాడు. తండ్రి తర్వాత తండ్రిలా మారాడు. 1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరో ఏట మా అన్న భుజాల మీదికెక్కినాను. అతను మరణించేదాకా దిగలేదు. నేను అతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ అతను నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అంటూ కాళోజీ అన్నాడు. నిజాన్ని ఇంత నిర్భయంగా ఒప్పుకోగల గొప్ప ఔచిత్యం కాళోజీది.
Writer Kaloji Narayana Rao
కాళోజీ రాత పొట్లాడినట్టే ఉంటుంది. నిలువుటద్దమై మనల్ని మనమే ప్రశ్నించుకున్నట్టే ఉంటుంది. నిప్పులాంటి నిజాన్ని చూడాలనుకుంటే.. కాళోజీ కవితలను చదవాల్సిందే. ఆయన కలం దోపిడీపై దునుమాడింది.. రెండు నాలుకల స్వభావాన్ని దుయ్యబట్టింది. మనిషిలోని నడతలోని నాణ్యాన్ని కోరింది.
మనిషి ఎంత మంచివాడు
చనిపొయిన వాని చెడును
వెను వెంటనే మరుస్తాడు
కని మంచినె తలుస్తాడు
మనిషి ఎంత చెడ్డవాడు
బ్రతికివున్న మనిషిలోని
మంచినెపుడు గుర్తించుడు
చెడును వెతికి కెలుకుతాడు
–కాళోజి
దొంగవలె అందాల తొంగిచూచుట తప్పు
అగుపడిన అందాన్ని అరయకుండుట తప్పు
కనపడ్డ ప్రతిదాని కాసపడుటయు తప్పు
భంగపడి వాంఛలకు లొంగిపోవుట తప్పు
కినుకతో మదిలోన క్రుంగిపోవుట తప్పు
పైకి ప్రహ్లాదువలె పలుకుచుండుట తప్పు
సహజ ప్రవృత్తులను చంపివేయట తప్పు
సహజమని వృత్తుల చంకచేరుట తప్పు
–కాళోజి
దోపిడీపై
దోపిడి చేసే ప్రాంతేతరులను
దూరం దాకా తన్ని తరుముతం
ప్రాంతం వాడే దోపిడి చేస్తే
ప్రాణంతోనే పాతర వేస్తం…
–కాళోజి
—Annapoorna—